బుడమేరు వరద నుంచి నగరం క్రమంగా కోలుకుంటోంది. బాధితులు బుధవారం వెల్లువలా ముంపు ప్రాంతం నుంచి బయటకు తరలివస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో సింగ్‌నగర్ నుంచి దూరప్రాంతాలైన కండ్రిక, ఆంధ్రప్రభ కాలనీ, రాజీవ్‌నగర్, ప్రకాష్‌నగర్, ఎల్‌బీఎస్ నగర్, రాధానగర్, డాబాకొట్లు సెంటర్, ఇందిరానాయక్ నగర్, పైపులరోడ్డు, తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు పోటెత్తారు. తెల్లవారుజాము నాటికి రెండు నుంచి మూడు అడుగుల మేర సింగ్‌నగర్ దూర ప్రాంతాల్లో వరద మట్టం తగ్గింది. దీంతో గత మూడు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన వరద బాధితులు బయటకు వచ్చేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం నాటికి కండ్రిక, అంబాపురం వైపు ఉన్న ఆంధ్రప్రభ కాలనీ 11లో ఇంకా మెడలోతు నీటితోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 75 వేల మంది బుధవారం మధ్యాహ్నానికి బయటకు వచ్చేశారు. ఇంకో 75 వేల మంది బయటకు రావల్సి ఉంది.