విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతోంది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడుస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గర ఉండి పనులు చేయిస్తున్నారు. మళ్లీ బుడమేరకు వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో శరవేగంగా గండ్ల పూడుస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక పనులను సమీక్షిస్తున్నారు. బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతోంది. విజయవాడ నగరం కోలుకుంటోంది. బుడమేరు ముంచెత్తడంతో 5 నుంచి 8 అడుగుల వరద నీటిలో మునిగిన అజిత్ సింగ్‌నగర్, పాయకాపురం తదితర ప్రాంతాల్లో దాదాపు 80 శాతం ముంపు నుంచి బయటపడ్డాయి. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేస్తున్నారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 3454 మంది కార్మికులతోపాటు 450 మంది ప్రజారోగ్య సిబ్బందిని ఈ పనులకు వినియోగిస్తున్నారు. వీరితోపాటు ఇతర మున్సిపాలిటీల నుంచి వచ్చిన 5889 మంది కార్మికులను రంగంలోకి దించారు. కాగా, ఇళ్లలో బురద మేట వేయడంతో దాన్ని శుభ్రం చేసుకునేందుకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు ఏకంగా ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 48 ఫైర్ ఇంజన్లను తెప్పించారు.వాటిద్వారా వీధుల్లో, ఇళ్లలోకి చేరిన బురద, మురుగు కొట్టేస్తున్నారు. కాగా విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎంత వర్షం కురుస్తున్నప్పటికీ వరద బాతులకు సహాయ కార్యక్రమాల్లో ఇటువంటి ఆటంకాలు ఉండకూడదని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రంలోగా బుడమేరు గండ్లను పూడ్చాలని చంద్రబాబు అన్నారు. గండ్లు పూడ్చే పనిని మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.