సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిలమూలం పలుమార్లు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ ఇవాళ సంచలన వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే ఆదిమూలం తొలిసారి స్పందించారు. నేను 24 గంటలూ ప్రజా సేవకుడ్ని. ఆమె పార్టీలో ఒక మహిళా అధ్యక్షురాలు... ఎన్నికల సమయంలో నాతో పాటు ప్రచారంలో తిరిగింది. ఇప్పుడు కావాలనే కుట్రపూరితంగా నాపై ఆరోపణలు చేస్తున్నారు. నేను కిందిస్థాయి నుంచి పైకి వచ్చినవాడ్ని... 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఆ మహిళ నా ప్రత్యర్థులతో చేరి కుట్రపన్ని ఈ విధంగా ఆరోపణలు చేస్తోంది. ఆమెను నేను ఎక్కడా వేధించలేదు. ఆమెను ఓ సోదరి మాదిరిగా భావించాను. టీడీపీ మండల ఇన్చార్జినంటూ ఆమె ఆర్నెల్ల పాటు మాతో తిరిగింది. నేను ఎలాంటి తప్పు చేయలేదు... విశ్వసనీయత ఉన్న వ్యక్తిని నేను. ఆమె ఎలా వచ్చిందో, ఎలా పోయిందో నాకు తెలియదు... దేవుడి సాక్షిగా, నా బిడ్డల సాక్షిగా చెబుతున్నాను... నేను తప్పు చేశాను. నేను ఏమైనా తప్పు చేశానా లేదా అనేది ఆమెనే అడగండి. నా నియోజకవర్గంలో ఎవరినైనా అడగండి... నేను ఎలాంటివాడ్నో చెబుతారు. నేను తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు. అది మార్ఫింగ్ చేసిన వీడియో... కుట్రలో భాగంగానే ఆమెను వాడుకున్నారు. నేరుగా ఆమెతోనే చర్చించడానికైనా సిద్ధం" అంటూ కోనేటి ఆదిమూలం స్పష్టం వివరించారు.