విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద బాధితులకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాధితుల కోసం పలు రకాల ఆహార పదార్థాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్యాకెట్లు తయారు చేయించి పంపిణీ చేయిస్తోంది. ప్యాకింగ్, పంపిణీ తీరును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో నారాయణ మాట్లాడుతూ... ఒక్కో ప్యాకెట్ లో 6 యాపిల్స్, 6 బిస్కెట్ ప్యాకెట్లు, 2 లీటర్ల పాల ప్యాకెట్లు, 3 నూడిల్స్ ప్యాకెట్లు, 2 లీటర్ల వాటర్ బాటిల్స్ ఉన్నాయని తెలిపారు. నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను కూడా అందిస్తామని చెప్పారు. బుడమేరు మూడో గండిని పూడ్చేందుకు సైన్యం రంగంలోకి దిగిందని తెలిపారు. మరో 24 గంటల్లో పారిశుద్ధ్యం పనులు కూడా పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.