ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన భద్రతపై హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేశారు. జగన్‌కు జడ్‌ప్లస్ భద్రత కల్పిస్తున్నామని.. మొత్తం 58 మంది సిబ్బంది రక్షణగా ఉన్నారని ఎస్‌ఆర్‌సీ (రాష్ట్రస్థాయి భద్రత రివ్యూ కమిటీ) సభ్యులు, ఐపీఎస్ అధికారి ఎస్‌ఎన్.విశ్వనాథ్ హైకోర్టుకు తెలిపారు. ఒకవేళ జగన్‌కు భద్రతపై ఆందోళన ఉంటే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలే కానీ హైకోర్టులో పిటిషన్ వేయడానికి వీల్లేదన్నారు. వైఎస్ జగన్ తనకు ముప్పు ఉన్నట్లు ఆధారాలతో అధికారులకు ఎలాంటి వినతి అందించలేదన్నారు.
హైకోర్టులో జగన్ దాఖలు చేసిన పిటిషన్‌కు ఇతర కారణాలున్నట్లు కనిపిస్తున్నాయన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును కోరారు. వాస్తవానికి ఎల్లో బుక్ మార్గదర్శకాల ప్రకారం.. జడ్‌ప్లస్ కేటగిరీలోకి వచ్చే వ్యక్తికి 58 మంది భద్రతాసిబ్బందిని సెక్యూరిటీగా నియమిస్తారు. కానీ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2023లో తీసుకొచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం ప్రకారం.. జడ్‌ప్లస్ భద్రతకు అదనంగా సిబ్బందిని కల్పించినట్లు హైకోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో ప్రస్తావించారు.
మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఓటమితో.. జగన్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయారన్నారు. ఈ కారణంగా అదనపు భద్రత సిబ్బందిని పొందే విషయంలో జగన్, ఆయన కుటుంబసభ్యులకు 2023లో తెచ్చిన చట్టం వర్తించదని పేర్కొన్నారు. కానీ ఈ విషయాలను ప్రస్తావించికుండా, దాచిపెట్టి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు. జులై 16న రాష్ట్రస్థాయి ప్రత్యేక సెక్యూరిటీ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించిందని.. కొత్తగా ఎంపికైన ఎంపీ, ఎమ్మెల్యేల స్థాయి ఆధారంగా భద్రతను కల్పించాలని సిఫార్సు చేసినట్లు తెలియజేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో మాత్రం జడ్‌ప్లస్ కేటగిరీని కొనసాగించాలని భద్రతా కమిటీ నిర్ణయించినట్లు కోర్టుకు తెలిపారు.
జగన్‌కు గతంలో మాదిరి జడ్‌ప్లస్ భద్రతతోపాటు బీఆర్ (బుల్లెట్ రెసిస్టెంట్) అలాగే కొనసాగుతోందని గుర్తు చేశారు. జగన్ భద్రతను మూడు షిఫ్టుల్లో ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. వీఐపీల భద్రతను కేవలం సిబ్బంది సంఖ్యను బట్టి చూడకూడదని.. భద్రతా విధుల నిర్వహణలో మానవవనరులను తగ్గించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఎంతో దోహదపడుతోంది అని కౌంటర్‌లో ప్రధానంగా పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై రిప్లై వేసేందుకు సమయం కావాలని జగన్ తరఫు లాయర్ కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 13కు వాయిదా వేశారు. తాను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంతమంది భద్రతా సిబ్బందిని ఇచ్చారో దానిని పునరుద్ధరించేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు.