ఏపీలో భారీ వర్షాలు, వరదలు ఎంతటి విలయం సృష్టించాయో తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం ఇప్పటికీ వరద బీభత్సం నుంచి పూర్తిగా తేరుకోలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 32 మంది మృతి చెందగా, పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్లు కోల్పోయారు. 1.69 లక్షల ఎకరాల్లో సాధారణ పంటలు... 18 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం జరిగింది. 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించింది. ఈ ప్రకృతి విపత్తు వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం రూ.6,800 కోట్లు అని పేర్కొంది. ఇందులో రోడ్లు భవనాల శాఖకు సంబంధించి రూ.2,164.5 కోట్లు, జలవనరుల శాఖకు సంబంధించి రూ.1,568.6 కోట్లు, మున్సిపల్ శాఖకు రూ.1,160 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.481 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.301 కోట్లు, పంచాయతీరోడ్లకు రూ.167.5 కోట్లు, మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 75.5 కోట్లు, ఉద్యానవన శాఖకు రూ.39.9 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.11.5 కోట్లు, అగ్నిమాపకశాఖకు రూ.2 కోట్లు నష్టం జరిగినట్టు ప్రభుత్వం వివరించింది. కేంద్రానికి పంపేందుకు ఈ మేరకు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశామని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి