విధి నిర్వహణలో భాగంగా ఓ ట్రాక్‌మెన్ చూపిన తెగువ..సమయస్ఫూర్తి ఓ రైలును పెను ప్రమాదం నుంచి బయటపడేలా చేసింది. పట్టాలపై వెల్డింగ్ లోపాన్ని గుర్తించిన అతడు.. అదే మార్గంలో వస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను ఆపేందుకు మెరుపు వేగంతో ముందుకు ఉరికాడు. ఐదు నిమిషాల్లోనే పట్టాలపై అర కిలోమీటరు మేర పరుగెత్తాడంటే అతడు ఎంతటి వేగంతో దూకాడో అర్దం చేసుకోవచ్చు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాదేవ అనే ట్రాక్‌మెన్ తన విధుల్లో భాగంగా కొంకణ్ రైల్వే డివిజన్‌లోని కుమ్టా, హొన్నావర్ స్టేషన్‌ల మధ్య తనిఖీలు నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున 4.50 గంటల ప్రాంతంలో ఓ చోట జాయింట్ వద్ద వెల్డింగ్ అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించాడు. కానీ, అప్పటికే ఆ మార్గంలో తిరువనంతపురం- న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ దూసుకొస్తోంది. దీంతో అప్రమత్తమైన మహాదేవ్ కుమ్టా రైల్వే స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. అయితే.. అప్పటికే రైలు ఆ స్టేషన్‌ను దాటేయడంతో నేరుగా లోకో పైలట్‌ను అలర్ట్ చేయడానికి యత్నించాడు. ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక, ఒక్క క్షణం ఆలస్యం చేసినా ఘోర జరిగిపోతుందని భావించిన అతడు.. రైలును ఆపేందుకు పట్టాల వెంబడి ఎదురుగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
పరుగులు లంఘించుకుని ఐదు నిమిషాల్లో అర కిలోమీటర్ మేర పరిగెత్తాడు. లోకోపైలట్‌కు పొంచి ఉన్న ప్రమాదం గురించి సిగ్నల్ అందించి, సకాలంలో రైలును ఆపివేయగలిగాడు. వెల్డింగ్ పని పూర్తయిన అనంతరం.. రైలు తిరిగి యధావిధిగా బయలుదేరింది. వందల మందిని కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన మహాదేవపై రైల్వే ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు. అతడి తెగువను కొనియాడారు. ఆయనను సత్కరించి, రూ.15 వేల నగదు బహుమతిగా అందించారు. మహాదేవ్ సమయస్ఫూర్తి పెను విపత్తు నుంచి తప్పించిందని, లేకుంటే ప్రమాదాన్ని ఊహించలేమని అన్నారు.
కాగా, ఇటీవల చోటుచేసుకుంటోన్న రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ప్రమాదాల నివారణకు కవచ్ అనే వ్యవస్థలను పట్టాల వెంబడి ఏర్పాటుచేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఢిల్లీ-ఆగ్రా మధ్య ఈ వ్యవస్థ ఏర్పాటయ్యింది.