మరో ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖలను హోం మంత్రి అనిత అప్రమత్తం చేశారు.ఉత్తరాంధ్రను వానలు ముంచెత్తుతుండడంతో విజయవాడ నుంచి హోంమంత్రి అనిత బయలుదేరి వెళ్లారు. కోస్తాంధ్రలోను అతి భారీ వర్షాలున్నాయన్న వాతావరణ శాఖ సమాచరం నేపథ్యంలో రాబోయే 72 గంటలు జాగ్రత్తగా ఉండాలని హోం మంత్రి సూచించారు. వంశధార, నాగావళి, బహుదా పరివాహక ప్రాంతాల ప్రజల మొబైళ్లకు ఎప్పటికప్పుడు అలెర్ట్ సందేశాలు పంపి అప్రమత్తం చేయాలని ఆదేశించారు.గోపాలపట్నం, కంచరపాలెం, అరకులోయ పరిసర ప్రాంతాలలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలపై హోంమంత్రి విచారం వ్యక్తం చేశారు. జ్ఞానాపురం ఎర్రిగెడ్డ, అల్లూరి జిల్లా మత్స్యగెడ్డల ఉగ్రరూపంపై ఎప్పటికప్పుడు వివరాలందించాలని ఆదేశించారు. ముంపు బారిన పడే అవకాశమున్న ప్రాంతాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు.
కాగా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తీరం దాటనుండడంతో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరదలు ఉప్పొంగుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అల్లూరి జిల్లా చింతపల్లి- నర్సీపట్నం ప్రధాన రహదారిలో రాకపోకలు బంద్ అయ్యాయి. రెండు రోజుల వర్షానికి పలుచోట్ల కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. మడిగుంట, రాజుపాకలు గ్రామాల వద్ద వరద ఉధృతికి కాజ్ వేలు కొట్టుకుపోయాయి. గిరిజన ప్రాంతంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో తెల్లవారుజాము నుంచి చింతపల్లి- నర్సీపట్నం మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రింతాడ గ్రామం వద్ద మరో కాజ్‌వే కూడా కొట్టుకొని పోవడంతో సీలేరు -చింతపల్లి మార్గంలో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. కాజ్ వేలు పునరుద్ధరణ చర్యలను జాతీయ రహదారి అధికారులు మొదలుపెట్టారు.