విజయవాడలో వీఆర్‌వో వరలక్ష్మి వైరల్ వీడియోపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వరద బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో వీఆర్వో జయలక్ష్మికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ఈ మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాలని.. లేకుంటే చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. వరద బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ.. ప్రశ్నించిన ఓ వ్యక్తిపై వీఆర్‌వో చేయి చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. వరదల కారణంగా విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి ఆహారంతో పాటుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోంది. సరుకులను పంపిణీ చేసేందుకు వెళ్లిన వీఆర్వో జయలక్ష్మిని స్థానికులు ప్రశ్నించారు. వారం రోజులుగా తమకు ఆహారం, మంచినీరు అందడం లేదంటూ అజిత్ సింగ్ నగర్ షాదీఖానా రోడ్డులో బాధితులు ఆందోళనకు దిగారు. ఈ విషయమై వీఆర్వో జయలక్ష్మిని ప్రశ్నించగా.. బాధితులకు, వీఆర్‌వోకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇన్ని రోజులు ఏమయ్యారంటూ బాధితులు అందరూ వీఆర్వోపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన వీఆర్వో.. ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో వైరల్ వీడియోపై నెటిజనం స్పందిస్తున్నారు. బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన వీఆర్వో ఈ రకంగా దాడికి దిగడం సరికాదనే కామెంట్లు పెడుతున్నారు. అలాగే ప్రభుత్వ అధికారులంటే ప్రజలకు సేవ చేయాలే కానీ.. ప్రశ్నించారనే కారణంతో చెంప పగలగొడతారా అంటూ మండిపడుతున్నారు. ఇక వీఆర్వో వైరల్ వీడియో వ్యవహారం ప్రభుత్వం దృష్టికి చేరటంతో.. ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే వీఆర్వో జయలక్ష్మికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీఆర్వో జయలక్ష్మి షోకాజ్ నోటీసులు జారీచేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన.. వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
అయితే స్థానికులే తనపై దాడికి యత్నించారని వీఆర్వో చెబుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు పోలీసుల సమక్షంలోనే ఈ తతంగమంతా జరగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల సమక్షంలోనే సామాన్యుడిపై వీఆర్వో చేయిచేసుకోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. అక్కడే ఉండి పోలీసులు ఏం చేస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.