మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో పూరీ వద్ద తీరం దాటినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇక క్రమంగా బలహీనపడనుంది. దీని ప్రభావం మరో 24 గంటలపాటు ఉంటుందని గోపాల్‌పూర్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ ఒడిశా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మల్కాన్‌గిరిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వాగులూ, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరి జనం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాయుగుండం ప్రభావం ఏపీపై మరో 24 గంటలు ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు.
వాయుుగుండం తీరం దాటిన ప్రభావంతో ఏపీలో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఇక ఉభయగోదావరి జిల్లాలతో పాటుగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో అలర్ట్ అయిన అధికారులు పలు జిల్లాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పలు జిల్లాలలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ఇక ఉత్తరాంధ్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలోని తాండవ జలాశయంలోకి వరద ప్రవాహం పెరిగింది. నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. అలాగే జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 380 అడుగులు కాగా.. ప్రస్తుతం 379 అడుగులుగా నీటిమట్టం ఉంది. దీంతో 600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వాసులను హెచ్చరిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రలోని పలుచోట్ల కొండ చరియలు విరిగిపడుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి.