డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఈ మాట వింటూనే ఠక్కున ఓ వ్యక్తి మన మెదడులో మెదులుతాడు. ఆయన పేరు తెలియకపోయినా.. ఆయన బ్రాండ్ అయితే వెంటనే గుర్తొచ్చేస్తుంది. బోడి గుండుతో ఉంటూ తన కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్లలో తానే నటిస్తూ తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైన లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్.. తన గొప్ప మనసు చాటుకున్నారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన వంతు సాయం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి సీఎం సహాయనిధికి లలితా జ్యువెలర్స్ కిరణ్ కుమార్ కోటి రూపాయలు విరాళంగా అందించారు. సీఎంను కలిసి విరాళం తాలూకూ చెక్‌ను ఆయన చేతికి అందించారు. ఇక 75 ఏళ్ల వయసులోనూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల కోసం కష్టపడుతున్నారని కిరణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. విపత్తు వేళ ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సాయం చేసి ఏపీని ఆదుకోవాలని కోరారు.
మరోవైపు కొవిడ్ సమయంలోనూ కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత ఏపీకి భారీ విరాళం అందించారు. అప్పట్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి విరాళం తాలూకు చెక్ అందించారు. ఇప్పుడు మరోసారి విపత్తు వేళ అండగా నిలిచారు. ఇక వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు పోటెత్తుతున్నాయి. రంగాలకు అతీతంగా విరాళాలు అందిస్తున్నారు. సినీ రంగం నుంచి చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి ప్రముఖులతో పాటుగా చిన్న నటులు కూడా తమకు తోచినైన స్థాయిలో విరాళం అందించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వంటి నేతలు కూడా భారీగా విరాళాలు ఇచ్చారు.
ఇక వరద బాధితులకు సహాయం చేయాలనుకునేవారి కోసం ఏపీ ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ కూడా ఏర్పాటు చేసింది. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా పలువురు వ్యాపారులు, వ్యాపార సంస్థలు విరాళాలు అందిస్తున్నాయి. ఈ విరాళాల సాయంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టడంతో పాటుగా బాధితులకు ఆహారం, మంచినీరు, నిత్యావసరాలు, మందుల పంపిణీని చేపడుతున్నారు. ప్రభుత్వమే కాకుండా వైసీపీ పార్టీ, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా బాధితులకు అండగా నిలుస్తూ వారికి ఆహారం, మంచినీరు వంటివి సరఫరా చేస్తున్నాయి.