వరద విపత్తుపై ప్రజలను అలర్ట్ చేయడంలోనూ, ముందస్తు చర్యల్లోనూ దారుణంగా విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ తర్వాత వరద సహాయక చర్యల్లోనూ వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. నిర్వాసితులను ఆదుకోవడంలో చర్యలు శూన్యం అన్న ఆయన, అసలు జనం లేని సమయంలో నష్టాన్ని ఎలా అంచనా వేస్తారని, వరదల్లో ప్రజలు నష్టపోయిన గృహోపకరణాల సంగతి ఏమిటని ప్రశ్నించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. విజయవాడను వరద ముంచెత్తి 8 రోజులు గడిచినా, ప్రభుత్వం ఇప్పటికీ అచేతనంగా ఉందన్న మాజీ ఎమ్మెల్యే, యుద్దప్రాతిపదికన పనులేవీ కనిపించడం లేదని, పైగా బుడమేరు వరదను గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వానికి అంటగట్టడం దారుణమన్నారు. ఆగష్టు 28న వాతావరణ శాఖ హెచ్చరించినా వీకెండ్స్‌లో సీఎం, మంత్రులు, అధికారులు బిజీగా ఉన్నారని, ఆనాడు జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ విషయాన్ని కనీసం చర్చించలేదని చెప్పారు. వరద ముంచెత్తిన తర్వాత కూడా ప్రభుత్వం కళ్ళప్పగించి చూసిందన్న మల్లాది విష్ణు, లక్షలాది మంది సమస్యపై ఇలాగేనా స్పందించేదని నిలదీశారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు జగన్‌గారిపై విమర్శలకే పరిమితమయ్యారన్న ఆయన, రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్‌పీ సిసోడియానే సమస్యను తక్కువ చేసి మాట్లాడితే ఇంక మిగిలిన వారు ఏం చేస్తారని ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైయస్ జగన్, ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ఎలా చేశారో తెలుసుకోవాలని సూచించారు.