గతంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావుకు ఊరట దక్కింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఆయనను తిరిగి సర్వీసులో చేర్చుకుంటూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరావుకు గతంలో ఉన్న ప్రణాళిక శాఖలో సహాయ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.. అలాగే 2023 సెప్టెంబరు 29 నుంచి 2024 ఆగస్టు ఆరో తేదీ వరకు ఆయన సస్పెన్షన్ కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయనపై గతంలో నమోదైన అభియోగాలను కూడా ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.
శ్రీనివాసరావు విధులకు గైర్హాజరయ్యారని, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని నమోదైన అభియోగాలు పాక్షికంగా మాత్రమే రుజువైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం ఒక్కటే ఆయన చేసిన తప్పని.. అనారోగ్య కారణాలతో చికిత్స కోసం విదేశాలకు వెళ్లినట్లుగా ఆయన సమర్పించిన ఆధారాలతో ప్రభుత్వం సంతృప్తి చెందింది. మరోసారి అలా చేయవద్దని మందలిస్తూ.. ఆ అభియోగాల నుంచి ఆయనకు రిలీఫ్ ఇచ్చింది ప్రభుత్వం. త్వరలోనే ఆయన సర్వీసుల్లోకి చేరనున్నారు.
పెండ్యాల శ్రీనివాసరావు 2019 వరకు చంద్రబాబుకి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీనివాసరావుపై కూడా అభియోగాలు రాగా.. ఐటీ ఆయన ఇంట్లో సోదాలు చేసింది. అలాగే ఆయనపై కేసులు కూడా నమోదు చేశారు. ఆయన సెలవు మంజూరు చేయాలని, విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని దరఖాస్తు చేసుకోగా.. ముందు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత రద్దు చేసింది. ఆయన విధులకు గైర్హాజరయ్యారని.. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని అభియోగాలతో ఆయన్ను సస్పెండ్ చేశారు.
పెండ్యాల శ్రీనివాసరావుపై శాఖాపరమైన దర్యాప్తునకు అప్పటి ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. దర్యాప్తు అధికారిని కూడా నియమించగా.. ఆయన గత నెల ఏడో తేదీన ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదికపై శ్రీనివాసరావు వివరణ కోరిన ప్రభుత్వం... ఆయన ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెంది, అభియోగాల నుంచి విముక్తి కల్పిస్తూ, సస్పెన్షన్ రద్దు చేసింది. తిరిగి ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. పెండ్యాల శ్రీనివాసరావుకు బిగ్ రిలీఫ్ దక్కింది.