కడప జిల్లా వినాయక నిమజ్జనంలో అపశృతి జరిగింది.. ఇద్దరు యువకుల మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. వీరపునాయునిపల్లె మండలం ఎన్ పాలగిరి క్రాస్ గోనుమాకులపల్లె మార్గమధ్యంలో ఉన్న మొగమోరువంకలో గణేశ నిమజ్జనాలు జరుగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో వేంపల్లెకు చెందిన విగ్రహాన్ని కూడా నిమజ్జనం కోసం తీసుకొచ్చారు.. మొగమోరువంకలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా వేంపల్లెకు చెందిన జారిపాటి రాజా, క్రిస్టియన్ కాలనీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వంశీలు ప్రమాదవశాత్తు వాగులో పడిపోయారు.
ఇద్దరు వాగులో వారు పడిన చోట సుడిగండం ఉండటంతో గల్లంతయ్యారని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు పోలీసులకు, తహసీల్దార్‌కు సమాచారం ఇవ్వగా.. దాదాపు 4గంటల పాటు గాలించి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. రాజా, వంశీల మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. బేల్దారి జారిపాటి రాజాకు నలుగురు సంతానం.. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబాన్ని పోషిస్తున్న రాజా మరణంతో.. పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు.
ఈ ఘటనకు సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తోంది. వినాయక నిమజ్జనం చేస్తున్న సమయంలో పొరపాటున వినాయకుడి విగ్రహం కింద పడి వంశీ, రాజాలు చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. వినాయ నిమజ్జనాల సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పోలీసులు. ముఖ్యంగా నదులు, చెరువులు, వాగుల్లో విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో పెద్ద వయసు ఉన్నవాళ్లు, పిల్లల్ని దూరంగా ఉంచాలంటున్నారు. అలాగే ఈత పేరుతో నదులు, చెరువుల, వాగుల్లోకి దిగకూడదని హెచ్చరిస్తున్నారు. అలాగే స్థానిక పోలీసులు కూడా దగ్గరుండి నిమజ్జనాలను పూర్తి చేయిస్తున్నారు.. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కడప జిల్లాలోనే మరో విషాద ఘటన జరిగింది. చక్రాయపేట మండలం ఆంజనేయపురంలో వినాయక నిమజ్జనం పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఇంటర్ విద్యార్థి ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి జారి పడి చనిపోయాడు. ఆంజనేయపురంలో వినాయక విగ్రహాన్ని కాలేటివాగులో నిమజ్జనం చేశారు. అనంతరం తిరిగి వస్తుండగా..ఇంటర్ విద్యార్థి పోలేపల్లె గౌతమ్ ట్రాక్టర్ వెనుక వైపు కూర్చున్నాడు. నెర్సుపల్లెక్రాస్ దగ్గరకు రాగానే.. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ నుంచి జారి కిందపడి చనిపోయాడు. గౌతమ్ కిందపడే సమయంలో మరొకరు పట్టుకునే ప్రయత్నం చేయగా కుదరలేదు.. కిందపడ్డ గౌతం తలపై ట్రాక్టర్ టైరు ఎక్కడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గౌతంది అన్నమయ్య జిల్లా మదనపల్లె దగ్గర అంగళ్లు కాగా.. ఆంజనేయపురంలోని బంధువుల ఇంట్లో ఉండి రాయచోటిలో ఇంటర్ చదువుతున్నాడు. ఈ ఘటన కూడా స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.