ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాస్‌పోర్ట్ వ్యవహారం హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వం, జగన్ తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. విజయవాడలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుకావడం నామోషీగా భావించి.. ఆ కోర్టు విధించిన షరతులపై మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారని ప్రభుత్వం తరఫు పీపీ వాదనలు వినిపించారు. జగన్ మూడు, నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న విజయవాడ కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొట్టాలని.. పాస్‌పోర్ట్ రెన్యువల్ విషయంలో పూచీకత్తు సమర్పించేందుకు ఆయన నామోషీగా భావిస్తున్నారన్నారు.
వ్యక్తుల గుర్తింపు, హోదాలకంటే చట్టం గొప్పదన్నారు పీపీ లక్ష్మీనారాయణ. ఎవరైనా కోర్టుల్లో విధించిన షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని.. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదన్న విషయాన్ని గమనించాలన్నారు. ఓవైపు కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటానని పిటిషన్‌లో పేర్కొని.. మళ్లీ అవే షరతుల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారన్నారు. 2018లో విజయవాడ కోర్టులో నమోదైన పరువు నష్టం కేసు గురించి జగన్‌కు తెలుసని.. ఆయన ఎన్నికల సంఘానికి 2019, 2024 ఎన్నికల అఫిడవిట్‌లో పరువునష్టం కేసు పెండింగ్‌లో ఉన్న అంశాన్ని నంబర్‌తో సహా ప్రస్తావించారన్నారు.
తాజాగా విజయవాడలో పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లాకే పరువునష్టం కేసు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందని చెప్పడం అబద్ధమన్నారు పీపీ లక్ష్మీనారాయణ. విజయవాడ ప్రత్యేక కోర్టు పరువునష్టం కేసులో పంపుతున్న సమన్లను హోదాను అడ్డుపెట్టుకొని జగన్ తీసుకోవడం లేదు అన్నారు. ఈ పరువునష్టం కేసు విచారణను ఐదున్నరేళ్లుగా సాగదీస్తున్నారని..ఈ కేసు విచారణపై హైకోర్టు స్టే ఇచ్చిందని జగన్ చెప్పడంలో వాస్తవం లేదన్నారు. జగన్ తనపై నమోదైన పరువునష్టం కేసు గురించి తెలియదంటూ హైకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని.. వాస్తవాలను దాచి పెడుతున్నారన్నారు. అలాగే జగన్‌కు విజయవాడ కోర్టు మరోసారి నోటీసుల జారీ చేసిందన్నారు. ఈ కేసులో విచారణను కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసిందని ప్రస్తావించారు. విజయవాడ కోర్టు జగన్ పాస్‌పోర్ట్‌ను ఏడాదికి మాత్రమే రెన్యువల్ చేయాలని.. తమ ముందు హాజరై రూ. 20వేల పూచీకత్తు సమర్పించాలని విధించిన షరతులు సహేతుకంగానే ఉన్నాయన్నారు. ఈ షరతుల విషయంలో జోక్యం చేసుకోవద్దని.. ప్రస్తుత కేసు విషయంలో జగన్ వ్యవహార శైలిని గమనించి ఈ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ డిప్లొమేటిక్ పాస్‌పోర్ట్ ఉండేదని గుర్తు చేశారు జగన్ తరఫున సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి. సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత సాధారణ పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు పాస్‌పోర్ట్ ఐదేళ్లు రెన్యువల్ చేసేందుకు అంగీకరించిందని గుర్తు చేశారు. 2018లో విజయవాడ ప్రత్యేక కోర్టులో అప్పటి మాజీ మంత్రి పొంగూరు నారాయణ దాఖలు చేసిన పరువునష్టం కేసు పెండింగ్‌లో ఉందని.. అక్కడి నుంచి ఎన్‌వోసి తెచ్చుకోవాలని పాస్‌పోర్ట్ అధికారులు సూచించారన్నారు. అప్పుడు జగన్ విజయవాడ ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా.. ఏడాదికి మాత్రమే రెన్యువల్‌కు అనుమతిచ్చింది అన్నారు.
హైదరాబాద్‌లో సీబీఐ కోర్టు పాస్‌పోర్ట్ రెన్యువల్‌కు ఐదేళ్లు అనుమతించిందని.. కానీ విజయవాడ కోర్టు ఏడాదికి అంగీకారం తెలిపిందన్నారు పొన్నవోలు. జగన్‌ను స్వయంగా కోర్టుకొచ్చి రూ.20వేల పూచీకత్తు బాండ్‌ను సమర్పించాలని షరతు విధించిన విషయాన్ని గుర్తు చేశారు. విజయవాడ ప్రత్యేక కోర్టుకు ఇలాంటి ఆదేశాలిచ్చే అధికారం లేదు. విజయవాడ కోర్టు పరువునష్టం కేసులో జారీచేసిన సమన్లు ఇంత వరకు పిటిషనర్‌కు అందలేదన్నారు. అప్పుడు కేసు పెండింగ్‌లో ఉన్నట్లు భావించడానికి వీల్లేదని.. పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. గతంలో హైకోర్టు విజయవాడ కోర్టులో పరువునష్టం కేసు విచారణను నిలుపుదల చేసిందని.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక కోర్టు విధించిన షరతులను రద్దు చేయాలని కోరారు. జగన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై వాదనలు పూర్తి కాగా.. ఈ నెల 11న నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే.కృపాసాగర్ తెలిపారు.