సాధారణంగా మనం ఏదైనా వాహనం కొంటే దాని వారెంటీ ఉన్నన్ని రోజులు.. అది పాడైతే షోరూం రిపేర్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఏ సమస్య వచ్చినా వాళ్లే చూసుకోవాల్సి ఉంటుంది. ఓ వ్యక్తి ఎంతో ఇష్టంతో ఓ స్కూటర్‌ను కొనుక్కోగా.. ఇంటికి వెళ్లిన 2 రోజులకే పాడైంది. దీంతో మళ్లీ ఆ స్కూటర్‌ను షోరూమ్‌కు తీసుకెళ్లిన ఆ వ్యక్తి.. దాన్ని రిపేర్ చేసి ఇవ్వాలని సిబ్బందిని కోరాడు. అయితే అతడు చెప్పిన సమస్యను పట్టించుకోని షోరూం సిబ్బంది.. దాన్ని రిపేర్ చేయడానికి మరింత జాప్యం చేశారు. అలా 10 రోజులు గడిచినా.. షోరూం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. రాత్రి పూట షోరూం మూసి ఉన్న సమయంలో అక్కడికి వెళ్లిన ఆ వ్యక్తి పెట్రోల్ పోసి.. కాల్చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
కలబురిగి ప్రాంతానికి చెందిన మహ్మద్ నదీమ్ అనే వ్యక్తి గత నెల 28వ తేదీన స్థానికంగా ఉన్న ఓలా షోరూమ్‌కు వెళ్లి ఓలా స్కూటీ కొనుగోలు చేశాడు. మొత్తం రూ.1.4 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆ స్కూటీ ఇంటికి తీసుకెళ్లిన 2 రోజులకే సరిగా పనిచేయలేదు. దీంతో వెంటనే ఆ ఓలా ఎలక్ట్రిక్ స్కూటీని తీసుకువచ్చి.. రిపేర్ చేయాలని షోరూంలో అప్పగించాడు. ఆ స్కూటీలో టెక్నికల్ సమస్య తలెత్తిందని.. బ్యాటరీ, సౌండ్ సిస్టమ్ పనిచేయకపోవడం లేదని మహ్మద్ నదీమ్.. వారికి తన సమస్యను వివరించాడు.
దీంతో ఆ స్కూటీని షోరూంలో ఇచ్చి వెళ్లాలని సూచించిన సిబ్బంది.. రిపేర్ మాత్రం చేయలేదు. అలా దాదాపు 10రోజుల పాటు ఎదురు చూశాడు. అయితే 10 రోజులు పూర్తయినా వారు తన కొత్త స్కూటీని రిపేర్ చేయలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నదీమ్.. మంగళవారం రాత్రి షోరూమ్ మూసేసిన తర్వాత అక్కడికి వెళ్లి.. షోరూంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆ షోరూం మంటల్లో చిక్కుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మొదట షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఓలా షోరూంలో అగ్నిప్రమాదం జరిగిందని భావించారు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. తన స్కూటీని రిపేర్ చేసి ఇవ్వడంలో షోరూం సిబ్బంది చేస్తున్న ఆలస్యంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న మహ్మద్ నదీమ్.. ఈ ఘటనకు పాల్పడ్డాడని గుర్తించి.. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే షోరూం మూసి ఉన్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సిబ్బంది తెలిపారు. కానీ ఈ ఘటనలో షోరూమ్ పూర్తిగా కాలిపోయిందని.. అందులో ఉన్న 6 స్కూటర్లు, కంప్యూటర్లు, ఇతర ఫర్నీచర్ పూర్తిగా కాలిబూడిద అయయ్యాయని పేర్కొన్నారు.