దాదాపు ఏడాది నుంచి హమాస్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయేల్ మానవవనరుల కొరతను ఎదుర్కొంటోంది. దీంతో విదేశాల నుంచి కార్మికులను రప్పిస్తోంది. ముఖ్యంగా భారత్ నుంచి వేల సంఖ్యలో నియామకాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా మరోసారి వేలాది మందిని నియమించుకునేందుకు భారత్‌ను ఇటీవల సంప్రదించిందని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) పేర్కొంది. ఇజ్రాయేల్ ప్రతిపాదించిన వాటిలో 10వేల నిర్మాణ కార్మికులు, ఐదు వేల ఆరోగ్య సంరక్షకుల ఉద్యోగాలు ఉన్నాయని, అర్హులైనవారిని నియమించుకోనున్నట్లు తెలిపింది.
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఉద్యోగుల ఎంపిక విధానంలో జరిగిన లోపాల గురించి మీడియాలో వచ్చిన కథనాలపై ఎన్ఎస్డీసీ స్పందించింది. ఫ్రేమ్‌వర్క్, ఐరన్ బెండింగ్, ప్లాస్టరింగ్, సిరామిక్ టైలింగ్ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఇజ్రాయఏల్‌కు చెందిన పాపులేషన్, ఇమ్మిగ్రేషన్, బోర్డర్ అథారటీ ఇటీవల మరోసారి తమను సంప్రదించిందని తెలిపింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా స్కిల్ టెస్ట్ నిర్వహణ కోసం మరికొన్ని వారాల్లోనే పీఐబీఏ బృందం భారత్‌కు రానుందని పేర్కొంది.
మొదటి విడతలో ఉత్తర్ ప్రదేశ్ హరియాణా, తెలంగాణాల్లో 10,349 నిర్మాణ కార్మికులను నియమించుకున్న ఇజ్రాయేల్.. ఈసారి మహారాష్ట్రలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ఎన్ఎస్డీసీ వివరించింది. ఎంపికైన వారికి నెలకు రూ.1.92 లక్షల వేతనంతో పాటు బీమా, ఆహారం, వసతి కల్పిస్తారని చెప్పింది. దీంతో పాటు రూ.16,515 బోనస్ కూడా ఇస్తారు. నిర్మాణ రంగంతో పాటు కాకుండా వైద్య రంగంలో 5 వేల మంది సంరక్షకులను నియమించుకోనుంది. 10వ తరగతి ఉత్తీర్ణత, కేర్‌గివింగ్ కోర్సు పూర్తి చేసి కనీసం 990 గంటల పాటు సంబంధిత విభాగంలో శిక్షణ పొందిన వారు ఈ ఉద్యోగానికి అర్హులని ఎన్ఎస్డీసీ వెల్లడించింది.
ఇజ్రాయేల్‌కు వెళ్లిన కొంతమంది కార్మికులు నైపుణ్యం లేనివారని నివేదికలు వచ్చినప్పటికీ.. అభ్యర్థులందరూ ప్రీ-డిపార్చర్ ఓరియంటేషన్ శిక్షణ పొందడం తప్పనిసరి అని NSDC తెలిపింది. కాగా, గతేడాది మే నెలలో ఇజ్రాయేల్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. తాత్కాలిక ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇజ్రాయేల్‌తో ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందంతో నిర్మాణ, నర్సింగ్ రంగాల్లో 40 వేల మంది భారతీయులను నియమించుకోడానికి అవకాశం కలిగింది. ఇప్పటికే వేలాది మంది భారతీయులు ఇజ్రాయేల్‌లో నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు.