అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో అధికార డెమోక్రాటిక్ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బరిలో ఉన్న కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ తాజాగా.. మొట్టమొదటిసారి ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే తొలిసారి ముఖాముఖిగా తలపడిన ట్రంప్-హారిస్ చర్చను.. ప్రపంచ దేశాలు గమనించాయి. గతంలో ట్రంప్-బైడెన్ మధ్య జరిగిన తొలి డిబేట్‌లో ట్రంప్ పై చేయి సాధించగా.. తాజాగా జరిగిన ట్రంప్-హారిస్ డిబేట్‌లో కమలా హారిస్‌దే పై చేయి అని అమెరికా మీడియా వెల్లడించింది. ఈ డిబేట్ సందర్భంగా.. కమలా హారిస్ చాలా ధీటుగా బదులిచ్చారని అమెరికా మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
ఇక ఆ డిబేట్‌లో కమలా హారిస్ చాలా స్ట్రాంగ్‌గా కనిపించారని.. ధృడ విశ్వాసంతోపాటు ఆమెలో దూరదృష్టి కనిపించినట్లు అమెరికా మీడియా తెలిపింది. ఇక కమలా హారిస్-డొనాల్డ్ ట్రంప్ మధ్య ఏబీసీ మీడియా డిబేట్‌ను నిర్వహించింది. వీరిద్దరి వాదనల్లో ఎంత వాస్తవం ఉందనే విషయంపై తాజాగా పూర్తి విషయాలు వెల్లడించింది. ఈ డిబేట్‌కు సంబంధించి.. అమెరికాలోని టాప్ మీడియా సంస్థలు పలు విషయాలను వెల్లడించాయి.
ఏబీసీ మీడియా: ఇక ఈ డిబేట్‌లో పైచేయి సాధించేందుకు కమలా హారిస్‌పై.. డొనాల్డ్ ట్రంప్ అసంబద్ధ, అవాస్తవ వాదనలు చేసినట్లు ఏబీసీ మీడియా తెలిపింది. ఇక డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలకు దీటుగా స్పందించిన కమలా హారిస్.. ఎలాంటి టైమ్ వేస్ట్ చేయకుండా ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించినట్లు వెల్లడించింది.
పొలిటికో: ట్రంప్-హారిస్ డిబేట్‌లో కమలా హారిస్‌దే విజయం అని పొలిటికో అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఆ విజయం సాధారణమైన విజయం కాదని.. భారీ తేడాతో విజయం ఉందని పొలిటికో తెలిపింది.
ది న్యూయార్క్ టైమ్స్: డిబేట్‌లో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌ను చిక్కుల్లో పడేసేందుకు గతంలో ప్రాసిక్యూటర్‌గా చేసిన అనుభవం ఉన్న కమలా హారిస్.. అనేక ఎత్తులు వేశారని ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ క్రమంలో కమలా హారిస్‌పై ఆధిపత్యం సాధించేందుకు బదులు.. తనను తాను సమర్థించుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేశారని తెలిపింది.
వాషింగ్టన్ పోస్ట్: వాషింగ్టన్ పోస్ట్ కూడా కమలా వైపే మొగ్గు చూపింది. డొనాల్డ్ ట్రంప్ వాదనలు వాస్తవాలకు దగ్గరగా లేవని.. ఆయన గత 2020 అధ్యక్ష ఎన్నికల నాటి వాదననే మళ్లీ తెరమీదికి తీసుకువచ్చారని ఆరోపించింది. సీఎన్‌ఎన్: ఈ డిబేట్ కోసం కమలా హారిస్ పూర్తిగా ప్రిపేర్ అయి వచ్చారని.. ఆమె ఇచ్చే ప్రతి సమాధానం డొనాల్డ్ ట్రంప్‌కు కోపం తెప్పించేలా ఉందని సీఎన్‌ఎన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. కమలా చెప్పే సమాధానాలతో కొన్నిసార్లు ట్రంప్ సహనం కోల్పోయినట్లు కనిపించారని వెల్లడించింది.
ఫాక్స్ న్యూస్: ఫాక్స్ న్యూస్ మాత్రం ట్రంప్-హారిస్‌లు హోరాహోరీగా ఒకరిపై మరొకరు పోరాడారని తెలిపింది. ఈ డిబేట్‌లో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ ఇద్దరూ ఉత్తమ ప్రతిభ కనబరిచారని ఫాక్స్‌న్యూస్ వెల్లడించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తొలి రోజుల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహరించారు. గతంలో డెమోక్రాటిక్ పార్టీ తరఫున మొదట అభ్యర్థిగా ఎన్నికైన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌తో పోలిస్తే ట్రంప్ చాలా ముందువరుసలో ఉండేవారు. బైడెన్‌తో జరిగిన తొలి డిబేట్‌లో ట్రంప్‌దే పైచేయి కావడం గమనార్హం. అయితే డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్ స్థానంలో కమలా హారిస్ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా ట్రంప్ కంటే హారిస్ ముందంజలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. తాజా డిబేట్‌లో కమలా హారిస్ తన సత్తాచాటడంతో డెమోక్రాట్లలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో రిపబ్లికన్ పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5వ తేదీన జరగనున్నాయి.