ప్రకాశం జిల్లా, కురిచేడు మండలం వెంగాయపాలెం సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన ఓ యువకుడు రైలు నుంచి జారి పడి మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా దర్రెపాడు మండలం గోగిదిన్నె గ్రామానికి చెందిన పెద్దిబోయిన ఉదయ్‌కిరణ్ (18) గుంటూరులోని ఓ ప్రైవేటు కాలేజిలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి అతడు నంద్యాల నుంచి గుంటూరుకు రైలులో బయలుదేరాడు. గుంటూరు- గుంతకల్ రైలు మార్గంలో కురిచేడు సమీపంలో 104/4 కిలోమటరు సమీపంలో ఉదయ్‌కిరణ్ రైలు నుంచి జారి కింద పడ్డాడు. తీవ్ర గాయాలవడంతోపాటు రైల్వే ట్రాక్ పక్కనే గడ్డితో ఉన్న గుంతలో పడిపోయాడు. బుధవారం ఉదయం ఆ దారిని వెళ్లే వారు గమనించి అతడిని ట్రాక్టర్లో కురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. అక్కడ వైద్య సిబ్బంది ప్రాధమిక వైద్యం అందించారు. కొద్ది సేపటికే ఉదయ్‌కిరణ్ మృతి చెందాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు వచ్చి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.