రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి 600 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన ఘటన బుధవారం సంతనూతలపాడులో జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపిన సమాచారం మేరకు.. అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని తరలి స్తున్నారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఎస్పీ కుల శేఖర్‌కు సమాచారం అందింది. దీంతో బుధవారం ఉదయం సంతనూతల పాడులో నాగరాజ ట్రేడర్స్ రైస్‌మిల్లుపై అధికారులు దాడులు చేశారు. బియ్యాన్ని మూడు మినీలారీల్లో తరలించేందుకు మిల్లు ఆవరణలో సిద్ధంగా ఉంచగా తనిఖీ చేశారు. అవి రేషన్ బియ్యమని నిర్ధారించారు. పట్టుకున్న పీడీఎస్ బియ్యాన్ని ఒంగోలు ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించామని, సీజ్ చేసిన మూడు మినీలారీలను ఎస్‌ఎన్‌పాడు ఎస్సై ఎం.దేవకుమార్‌కు అప్పగించినట్లు తెలిపారు. రైస్‌మిల్లు యజమాని, సూపర్ వైజర్, డ్రైవర్లపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి వారిని కోర్టుకు తరలించనున్నట్లు చెప్పారు. ఈ దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీసీటీవో రామారావు, ఎస్సై నాగేశ్వరరావు, తహసీల్దార్ వీఎస్.పాల్, ఎఫ్‌ఐ గుణవంశీ పాల్గొన్నారు.