ఒంగోలు జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలు అందుకు ఉపకరించాయి. అప్పటికే వేసి ఉన్న మెట్ట పైర్లు ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. కొత్తగా పంటల సాగు జోరందుకుంది. గడిచిన వారం రోజుల్లోనే దాదాపు 27వేల హెక్టార్లలో అదనంగా పంటలు సాగయ్యాయి. ప్రధానంగా పశ్చిమప్రాంతంలో మిర్చి, పొగాకు నాట్లు ఊపందుకొన్నాయి. నీటి వనరుల కింద అక్కడక్కడా వరినాట్లు వేస్తున్నారు. అలాగే వరి నారుమళ్లను సిద్ధం చేయడంతోపాటు ఇతర మెట్ట పైర్ల సాగుకు రైతులు భూములను సిద్ధం చేస్తున్నారు. ఇలా పొలం పనుల్లో అందరూ బిజీ అయ్యారు.