మీరు సంప్రదాయ పెట్టుబడిదారులా? ఇంకా మీ పెట్టుబడులపై 8 శాతానికి మించి రిటర్న్స్ రావాలని కోరుకుంటున్నారా. అయితే మీకో మంచి ఆప్షన్ ఉంది. చాలా మంది పెట్టుబడులు అంటే.. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కేంద్ర ప్రభుత్వ పోస్టాఫీస్ పథకాలు ఇంకా.. కాస్త రిస్క్ ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే.. రిస్క్ లేని మరో పెట్టుబడి పథకం కూడా ఉంది. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారెంటీగా ఉండటం విశేషం. ఈ స్కీమ్ తెచ్చింది కూడా ఆర్‌బీఐనే. అదే ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్. అయితే ఈ రిజర్వ్ బ్యాంక్ బాండ్లు అంటే ఏంటి.. ఈ బాండ్లలో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ బాండ్ల ద్వారా మీరు గ్యారెంటీ రిటర్న్స్ అందుకోవచ్చా. వీటి ద్వారా టాక్స్ కూడా సేవ్ చేసుకోవచ్చా. ఈ వివరాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్.. ఈ సేవింగ్స్ బాండ్లు జారీ చేస్తుంది. ఇక్కడ లాకిన్ పీరియడ్ ఏడు సంవత్సరాలుగా ఉంటుంది. ఇక ఈ బాండ్లలో మినిమం సబ్‌స్క్రిప్షన్ అమౌంట్ రూ. 1000 గా ఉంది. అంటే కనీసం వెయ్యి పెట్టుబడి పెట్టాలన్నమాట. ఇక గరిష్టంగా ఎలాంటి పరిమితి లేదు. ఆర్బీఐ బాండ్లలో చాలా వరకు ప్రముఖ బ్యాంకుల్లో డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ వస్తుందని చెప్పొచ్చు. ప్రముఖ బ్యాంకుల్లో చాలా వరకు 8 శాతానికి మించి వడ్డీ లేదని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ప్రస్తుతం వడ్డీ 8.05 శాతంగా ఉంది. ప్రతి 6 నెలలకు ఓసారి ఈ వడ్డీ రేట్లను సవరిస్తుంది కేంద్రం. అంటే ఇది పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా స్థిరంగా కూడా ఉండొచ్చు.
మిగతా వాటిల్లో ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయల్ ఆప్షన్ ఉంటుంది. అంటే అక్కడ కొంత వడ్డీ రేటు కోతతో గడువుకు ముందుగానే నగదు ఉపసంహరించుకోవచ్చు. కానీ ఆర్బీఐ బాండ్లలో ఆ ఫెసిలిటీ లేదని చెప్పొచ్చు. అంటే.. మీరు డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి.. ఏడేళ్ల పాటు వాటితో పనిలేదనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మెచ్యూరిటీకి ఒకేసారి పెద్ద మొత్తలో డబ్బులు చేతికి అందుతాయి. సీనియర్ సిటిజెన్లు మాత్రం మినిమం లాకిన్ పీరియడ్ తర్వాత.. కాస్త పెనాల్టీ చెల్లించి ముందుగా డబ్బులు తీసుకోవచ్చు.
ఇక్కడ వడ్డీ రేట్లు కేంద్ర ప్రభుత్వ పథకం.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌తో (ఎన్ఎస్సీ) లింక్ అయి ఉంటాయి. ఆ పథకం వడ్డీ రేటు కంటే 35 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ అధికంగా వస్తుంది. ఎన్ఎస్సీ లో ప్రస్తుతం 7.70 శాతం వడ్డీ ఉంది. ఈ స్కీం వడ్డీ రేట్లు మారితే.. దానికి అనుగుణంగానే ఆర్బీఐ బాండ్ల వడ్డీ రేట్లు కూడా మారుతుంటాయి. NSC వడ్డీ రేట్లను కేంద్రం.. ప్రతి 3 నెలలకు ఓసారి సవరిస్తుంటుంది. అయితే ఆర్బీఐ బాండ్లలో వడ్డీ రేట్లు 6 నెలలకు ఓసారి అంటే.. జనవరిలో ఓసారి, జులైలో ఓసారి మారుతుంటాయి. ఇలాగే 6 నెలల వ్యవధితో వడ్డీ చెల్లిస్తుంటుంది. ఇక్కడ వడ్డీ ఆదాయంపై టాక్స్ పడుతుంది. ఆర్బీఐ బాండ్లలో ఇన్వెస్ట్‌మెంట్లపై టాక్స్ డిడక్షన్ లేదు.