అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమొక్రాటిక్ నేత కమలా హ్యారిస్.. రిపబ్లికన్ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫిలడెల్ఫియా నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్‌లో మంగళవారం తొలి డిబేట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ డిబేట్ సమయంలో కమలా హ్యారిస్ ధరించిన చెవికమ్మలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎక్స్ (ట్విట్టర్)లో చాలా మంది నెటిజన్లు.. హ్యారిస్ ధరించిన ప్రత్యేకమైన చెవిపోగులపై మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ట్రంప్ మద్దతుదారులు అవి చెవికమ్మలు కాదని, డిబేట్ సమయంలో ఇతరుల సాయం తీసుకోడానికి పెట్టుకున్న ఇయర్‌ఫోన్స్ అని ఆరోపించారు. అంతేకాదు, అవి నోవా హెచ్ 1 కు చెందిన ఆడియో ఇయర్ రింగ్స్ అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
‘డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన ఏబీసీ ప్రెసిడెన్షియల్ డిబేట్ సందర్భంగా కమలా హ్యారిస్ తన చెవిపోగులలో ఇయర్‌ఫోన్‌లను పెట్టుకున్నట్టు కనిపిస్తోంది’ అని ఒకరు.. ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో కమలా అదరగొట్టారు.. తన వాగ్దాటితో ట్రంప్‌పై పైచేయి సాధించారని భావిస్తున్నాను.. కానీ ఆమె చెవిదిద్దులు నాకు చాలా ఆసక్తిని కలిగించాయి. చెవిపోగులు లాగా కనిపించే ఇయర్‌ఫోన్‌లను గుర్తుకుతెస్లున్నాయి’ అని మరో నెటిజన్ పోస్ట్ పెట్టాడు.
అయితే, కమలా ధరించిన చెవిపోగులు ముత్యాలు పొదిగిన టిఫనీ సంస్థ తయారుచేసినవి కావచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. నోవా హెచ్ 1 ఆడియో ఇయర్‌ఫోన్స్, ఆమె ధరించిన పోగుల మధ్య వ్యత్యాసాలను ఎత్తిచూపారు. టిఫనీ ఇయర్ రింగ్స్ ఫోటోను ఓ నెటిజన్ షేర్ చేయగా.... అవి హ్యారిస్ ధరించిన వాటికి దగ్గరగా ఉన్నాయి. వీటి ఖరీదు 3 వేల డాలర్ల కంటే ఎక్కువ ఉంటుంది కానీ.. టిఫనీ కంపెనీ ఆన్‌లైన్‌లో విక్రయించదు. ఆల్ఫా సోరోరిటీతో తన అనుబంధానికి గుర్తుగా ఉపాధ్యక్షురాలు తరచూ ముత్యాలను ధరిస్తారని కొందరు అంటున్నారు. హ్యారిస్ పెట్టుకున్నవి ఇయర్‌ఫోన్స్ కాదని కొట్టిపారేస్తున్నారు.
ఇక, నోవా హెచ్ 1 ఆడియో ఇయర్‌రింగ్స్ సంప్రదాయ ముత్యంలా అధునాతన సాంకేతికతను జోడించి వినూత్నంగా రూపొందించారు. ఈ ఇయర్‌ఫోన్‌లకు బ్లూటూత్ కనెక్టివిటీ, బిల్ట్-ఇన్ మైక్రోఫోన్‌లు, డిజిటల్ అసిస్టెంట్ సౌకర్యం ఉంటుంది. ముత్యం చెవిపోగుల ఆకారంలో మార్కెట్‌లోకి వచ్చిన మొట్టమొదటి వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ ఇవేనంటూ ఆ సంస్థ పేర్కొంది.
కాగా, చర్చ ప్రారంభానికి ముందు వేదికపై ప్రత్యర్ధి డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్లిన కమలా హ్యారిస్.. ఆయనతో కరచాలనం చేసి చిరునవ్వు చిందించారు. మనం రెండు విభిన్న విజన్‌లను వినబోతున్నామని, ఒకటి భవిష్యత్తుకు భరోసా కల్పించేదని, మరొకటి దేశాన్ని వెనక్కి తీసుకెళ్లేదని డిబేట్ ప్రారంభంలో ఆమె వ్యాఖ్యానించారు.