దేశంలో జరుగుతోన్న దొంగతనాలకు సంబంధించిన అంశంపై పోలీసులు జరుగుతోన్న సదస్సులో ఆ శాఖ మంత్రి బ్యాగును పోగొట్టుకున్నారు. ఉన్నతాధికారులతో ఓ హోటల్‌లో జరిగిన సదస్సులో బ్రిటన్ పోలీసింగ్ శాఖ మంత్రి డయానా జాన్సన్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆమె వ్యక్తిగత బ్యాగును ఎవరో తస్కరించారు. రద్దీతో సతమతమవుతున్న జైళ్ల నుంచి కొంతమంది ఖైదీలను విడుదల చేసిన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. దీంతో బ్రిటన్ పోలీసుల పనితీరు, భద్రత వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మధ్య ఇంగ్లాండ్‌లోని వార్‌విక్‌షైర్ కౌంటీలో పోలీస్ సూపరింటెండెంట్ అసోసియేషన్ వార్షిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ పోలీస్, నేర, అగ్నిమాపక శాఖ మంత్రి డయానా జాన్సన్ పాల్గొని..ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో అసాంఘిక శక్తులు, దొంగతనాలు, దుకాణాల్లో చోరీలు పెరగడానికి గత కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు.
‘సామాజిక వ్యతిరేక ప్రవర్తన, దొంగతనం, షాపుల లూటీలు అంటువ్యాధిలా పట్టిపీడిస్తున్నాయని అన్నారు. వీటికి అడ్డుకట్ట వేసేలా మెరుగైన చట్ట అమలు తక్షణ అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. చోరీల నియంత్రణ విషయంలో పోలీసులకు అదనపు శిక్షణ ఇచ్చే ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. అదే సమయంలో చేతివాటం ప్రదర్శించిన దొంగలు.. హోటల్‌లోని ఆమె బ్యాగును తస్కరించారు. చోరీల గురించి మంత్రి సెలవిస్తుండగానే బ్యాగును కోట్టేశారు.
ఈ చోరీకి సంబంధించి ఓ 56 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసిన వార్‌విక్‌షైర్ పోలీసులు.. అనంతరం అతడ్ని బెయిల్‌పై విడుదల చేశారు. మంత్రి వ్యక్తిగత బ్యాగు, వస్తువులు చోరీకి గురైన విషయాన్ని సంబంధిత మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది. అయితే, భద్రతకు సంబంధించి ఎటువంటి ముప్పు లేదని పేర్కొంది. ఇంగ్లాడ్, వేల్స్‌లలో ఖైదీల రద్దీని ఎదుర్కొంటున్న బ్రిటన్ జైళ్ల నుంచి కొందరిని విడుదల చేసిన రోజే ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇటీవల యూకే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీసు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గతేడాది కాలంలో ఆ దేశంలో బ్యాగులు, ఫ్లోన్లు వంటి వ్యక్తిగత సామాగ్రి చోరీ సహా దొంగతనాలు 40 శాతం మేర పెరిగాయి. దీంతో పోలీసులపై ప్రజలకు నమ్మకం పోతోంది. నేరాల నియంత్రణలో పోలీసులు సమర్ధవంతంగా వ్యవహరించడం లేదని ఇటీవల ఓ సర్వే సగం కంటే ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.