ఆహార పదార్థాలపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ విధిస్తున్న జీఎస్టీపై.. తమిళనాడులోని ఓ హోటల్ యజమాని.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ముందు ప్రశ్న అడిగాడు. ఫుడ్ ఐటెమ్స్‌పై భారీగా జీఎస్టీ విధిస్తుండటంతో.. కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని నిర్మలమ్మకు విన్నవించాడు. అయితే ఈ ఘటన తర్వాత.. ఆ హోటల్ ఓనర్.. ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్‌ను కలిసి క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో తమిళనాడు బీజేపీ నేత ఒకరు అక్కడే ఉన్నారు. ఈ క్షమాపణలకు సంబంధించిన వీడియోను బీజేపీ నేత ట్వీట్ చేయడంతో.. అది ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. జీఎస్టీ గురించి ప్రశ్నలు లేవనెత్తిన ఆ హోటల్ ఓనర్‌ను బీజేపీ నేతలు బెదిరింపులకు గురి చేసి.. ఆ తర్వాత నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెప్పించారని కాంగ్రెస్, డీఎంకే నేతలు, కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. క్షమాపణలు చెప్పారు.
కోయంబత్తూరు జిల్లాలోని వ్యాపారులతో ఇటీవల కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాలపై కేంద్ర ప్రభుత్వం అధికంగా జీఎస్టీ వసూలు చేస్తుండటం పట్ల అన్నపూర్ణ రెస్టారెంట్ చైన్ ఓనర్, తమిళనాడు హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ఛైర్మన్ శ్రీనివాసన్.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలపై వివిధ రకాలుగా జీఎస్టీ వసూలు చేస్తుండటం వల్ల రెస్టారెంట్లకు ఎదురవుతున్న సమస్యలను ఆయన కేందమంత్రికి వినిపించారు. స్వీట్లపై 5శాతం, బిస్కెట్లపై 12శాతం, క్రీమ్ ఫీల్డ్ బన్‌లపై 18శాతం జీఎస్టీ వసూలు చేయడంపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. అయితే బన్‌లపై ఎలాంటి పన్ను విధించకపోయినా.. దానిపై రుద్దే 18శాతం జీఎస్టీ విధించడాన్ని శ్రీనివాసన్ తప్పుపట్టారు.
అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత శ్రీనివాసన్.. వ్యక్తిగతంగా నిర్మలా సీతారామన్‌ను కలిసి.. ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ నేత శ్రీనివాసన్ కూడా అక్కడే ఉన్నారు. ఆ వ్యవహారానికి సంబంధించిన వీడియోను తమిళనాడు బీజేపీ సోషల్ మీడియా సెల్ కన్వీనర్ ట్విటర్‌లో షేర్ చేయడంతో తీవ్ర దుమారం రేపుతోంది.
ఇక హోటల్ యజమాని శ్రీనివాసన్‌ను బెదిరించి బీజేపీ నేతలు.. ఆయనతో నిర్మలా సీతారామన్‌కు బలవంతంగా క్షమాపణలు చెప్పించినట్లు కాంగ్రెస్, డీఎంకే నేతలతోపాటు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీలో ఉన్న లొసుగులను వివరించి, ప్రశ్నలు అడిగినందుకు శ్రీనివాసన్‌ను బీజేపీ ఘోరంగా అవమానించిందని ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత సుమంత్ సీ రామన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటన కాస్తా తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. శ్రీనివాసన్‌కు, నిర్మలా సీతారామన్‌కు మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ వీడియోను బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే శ్రీనివాసన్‌కు అన్నామలై క్షమాపణలు చెప్పారు.