మావోయిస్టుగా పనిచేస్తున్న తన కుమారుడు దున్న కేశవరావు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2011 సంవత్సరంలో జనజీవనస్రవంతిలో కలిశాడని, అయితే ఆ తరువాత ఒడిశా పోలీసులు విచారణ పేరుతో తీసుకువెళ్లి ఇప్పటి వరకు విడిచిపెట్టలేదని, దీంతో ఇబ్బందులు పడుతు న్నామని మాజీ మావోయిస్టు తల్లి కాములమ్మ వేడుకున్నారు. ఈ మేరకు శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో నిర్వహిం చిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిని ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తన ఆవేదనను ఎస్పీ ఎదుట వ్యక్తం చేసి తన కుమారుడి విడు దలకు చర్యలు తీసుకోవాలని వేడు కుంది, ఆమె తెలిపిన వివరాలిలా.. మందస మండలం నల్ల బొడ్లూరు గ్రామానికి చెందిన మావోయిస్టుగా వ్యవహరించిన దున్న కేశవరావు 2011లో అప్పటి ఎమ్మెల్యే జుత్తు జగన్నాయ కులు ఆధ్వర్యంలో హైదరాబాద్ వెళ్లి డీఐజీని కలిసి మావోయిస్టు జీవితాన్ని విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు. అప్పటికే అతనిపై రూ.లక్షల రివార్డు ఉంది. అన్నీ విడిచిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో తుపాకీని వీడి లొంగిపోయారు. అప్పట్లో ఆయనను అందరూ అభినందించారు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. బయటకు రాగానే మాటువేసి ఉన్న ఒడిశా పోలీసులు విచారణ చేపట్టి వెంటనే విడుదల చేస్తామని చెప్పి ఒడిశా పట్టుకెళ్లి భువ నేశ్వర్ కేంద్ర కారాగారంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను బంధిం చారు. ఒడిశా రాష్ట్రంలో కేశవరావుపై అనేక కేసులుండడంతో అక్కడి రాష్ట్ర చట్టం మేరకు జైలులో ఉండే కేసు విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఆ నేపథ్యంలో 13 ఏళ్ల పాటు నేటి వరకు జైలులోనే ఉన్నారు. భువనేశ్వర్‌లో దున్న కేశవరావును కలుసుకునేందుకు తల్లి కాములమ్మ చేసిన ప్రయత్నం, అతడు పడుతున్న ఇబ్బందులను వివరించారు.