ఉచిత ఇసుక విధానం అబాసుపాలవుతోంది. ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వినియోగదారుడికి ఇసుక చేరేసరికి ధర తడిసి మోపెడతువుతోంది.స్టాక్ పాయింట్‌లలో 20 టన్నులు (5 యూనిట్లు) ఇసుక ధర రూ.5,400లకు రశీదు ఇస్తుండగా అక్కడ రశీదులు కొట్టించే మధ్య దళారీలు రూ.3 వేలు తీసుకుంటున్నారని లారీ యజమానులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాలను బట్టి లారీ ఇసుక రూ. 20 వేల నుంచి 22 వేలకు అమ్ముతున్నారు.వాస్తవానికి కిరాయితో కలిపి 5 యూనిట్లు రూ.10 వేల లోపే వినియోగదారునికి చేరాలి. కానీ రెట్టింపు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.పందలపర్రు పెండ్యాల స్టాక్ పాయింట్‌లలో వర్షాల కారణంగా నాలుగు రోజులు ఇసుక ఎగుమతులు నిలిపివేశారు. గురువారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఇక్కడ రైతు భరోసా కేంద్రాల వద్ద ఇసుక బుక్ చేసుకోవడం ప్రహసనంగా మారిందని లారీ యజమానులు వాపోతున్నారు.స్టాక్ పాయింట్ల వద్ద స్థానికులకే ప్రాధాన్యం ఇస్తూ దూర ప్రాంతాల లారీలకు ఇసుక బుకింగ్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. టీడీపీ, జనసేనకు చెందిన వ్యక్తులంటూ కొందరు దాదాగిరి చేస్తున్నట్లు తెలుస్తున్నది. వరదలు, వర్షాల కారణంగా నిర్మాణాలు నాలుగింట మూడొంతులు నిలిచిపోయాయి. ఉన్న కొద్దిపాటి నిర్మాణాలకు ఇసుక సురఫరా చేయడానికి లారీలు బారులు తీరుతున్నప్పటికి స్టాక్ పాయింట్ల వద్ద టీడీపీ, జనసేన కూటమికి చెందిన లారీలకే చలానాలు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చే వారంలో ఇసుక బుకింగ్ ఆన్‌లైన్ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. వినియోగదారులు తమ తగ్గరలో ఉన్న మీసేవ కేంద్రాల్లో ఇసుక బుక్ చేసుకుని సంబంధిత స్టాక్‌పాయింట్‌లు, ర్యాంప్‌లలో ఇసుక తెచ్చుకునే విధానం అమ లులోకి తెస్తామని అధికారులు ప్రకటించారు.అయితే మూడు నెలలుగా వివిధ రూపాల్లో ఇసుక దందా కొనసాగుతూనే ఉంది. జగన్‌రెడ్డి పాలనలో వేల కోట్ల రూపాయలు ఇసుకను అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు చేస్తున్న పరిస్థితిల్లో కూటమి ప్రభుత్వంలోనూ అదేవిధానం కొనసాగడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.తక్షణం ఇసుక బుకింగ్ ఆన్‌లైన్ చేసి ఆయా స్టాక్ పాయింట్‌లు, ర్యాంప్‌లలో నిఘా ఏర్పాటు చేయా లని జియో ట్యాగింగ్ విధానం అమలు చేసి ఇసుక నేరుగా వినియోగదారునికి చేరుతుందా ? లేదంటే అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయా అనే ఇషయాన్ని పరిశీలించాలని కోరుతున్నారు.ఒక వైపు వరదలు, మరో వైపు భారీ వర్షాలు కురుస్తున్పటికి ఇసుకాసురులు రెచ్చిపోతూనే ఉన్నారు.ఇపుడున్న విధానం కొనసాగితే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని పలువురు కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు.మొత్తంగా ఇసుక ధరలు కొనుగోలుదారులకు కంటిలో నలుసుగా మారగా ప్రస్తుత ఇసుక అమ్మకం విధానాలు ప్రభుత్వానికి తల పోటుగా మారింది. ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి పెండ్యాల పందలపర్రు స్టాక్ పాయింట్ల వద్ద అదనంగా వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లారీ యజమానులు కోరుతున్నారు. స్టాక్ పాయింట్ల వద్ద రెండు మూడురోజులు వెయిటింగ్ చేయాల్సి రావడం, అదనంగా రూ. 3 వేలు మామూళ్లు ఇస్తుండటంతో కిరాయి కాస్త పెరుగుతుందని తామేమీ అన్యాయంగా వసూలు చేయడం లేదని లారీ యజమానులు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమలో టిప్పర్ లారీలు సుమారు 1000 ఉండగా ఇసుక కిరాయిలు కేవలం 100 లారీలకే దక్కుతున్నాయని పలువురు లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు ఇసుక అమ్మకాల్లో అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు, లారీ యజమానులు కోరుతున్నారు.