కాణిపాక వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారు గజ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శమిచ్చారు. కాణిపాకానికి చెందిన వన్నియ నాయకర్ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉదయం మూల విరాట్‌కు ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. రాత్రి ఉభయ వరస రావడంతో ఆలయ అలంకార మండపంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు చేసి,భక్తులకు తీర్ధప్రసాదాలను అందజేశారు. సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ విగ్రహాలను భక్తి శ్రద్ధలతో గజ వాహనంపై ఉంచి మంగళ వాయిద్యాల నముడమ కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. స్వామిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో గురుప్రసాద్, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు విఘ్నేష్, రవి, ఉభయదారులు పాల్గొన్నారు.శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయం తరఫున పట్టువస్త్రాలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఆలయ ఈవో ఎన్‌వీవీఎస్ మూర్తి తదితరులు కలిసి కాణిపాకానికి తీసుకొచ్చారు. ఆలయ అతిథి గృహం వద్ద వీరికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, వరసిద్ధుడి ఆలయ ఈవో గురుప్రసాద్ స్వాగతం పలికి, పట్టువస్త్రాలను తీసుకొచ్చి అర్చకులకు అందించారు.శనివారం స్వామికి రథోత్సవాన్ని(తేరు) నిర్వహించనున్నారు. కాకర్లవారిపల్లెకు కీర్తి శేషులు ఎత్తిరాజులునాయుడు జ్ఞాపకార్థం ఆయన కుమార్తె మీనాకుమారి, కాణిపాకానికి చెందిన మాజీ వీఎం కె.పూర్ణచంద్రారెడ్డి, కీర్తి శేషులు చంద్రశేఖర్‌రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు హరిప్రసాద్‌రెడ్డిలు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.రథోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో గురుప్రాద్ తెలిపారు. ప్రధాన ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు, అరటి బోదెలతో అలంకరించినట్టు తెలిపారు. ఉత్సవానికి వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో వారు ఇబ్బంది పడకుండా స్వామి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు.