టీడీపీ బలంతో మొదటిసారి జరిగిన ఒంగోలు కార్పొరేషన్ కౌన్సి ల్ సమావేశం విజయవంతమైంది. ఏదో ఒక విధంగా సమావేశం జరగకుండా చూడాలన్న తలంపుతో వైసీపీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. కోరం లేకుండా చేసేందుకు వారు వేసిన ఎత్తుగడలు విఫలమయ్యాయి. శుక్రవారం సమావేశం జరుగుతుందని తెలియడంతో గురువారం రాత్రి వైసీపీ కార్పొరేటర్లందరూ హైదరాబాద్‌లోని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకున్నారు. దీంతో సమావేశం జరగదని భావించిన వైసీపీ మూడింట రెండొంతుల సభ్యులు అనగా 36 మంది ఉంటేనే కౌన్సిల్ జరుగుతుందని అనుకున్నారు. అయితే నిబంధనల ప్రకారం మూడో వంతు సభ్యులు యాభై మందిలో18మంది ఉంటే సరిపోతుందని కమిషనరు వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా మునిసి పల్ చట్టంలోని అంశాలను వివరించడంతో సమావేశం ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగింది. అజెండాలోని 8వ అంశమైన వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కోసం హద్దురాళ్లు, రోడ్ల నిర్మాణం తదితర పనులకు సంబంధించి రూ.21.33 కోట్ల బిల్లుల మంజూరుపై సమావేశంలో చర్చకు వచ్చింది. దీనిపై మరింత లోతుగా చర్చించాల్సి ఉందని సభ్యులు తెలిపారు. దీంతో ఆ అంశాన్ని వాయిదా వేశారు.