కార్పొరేటర్లు, కార్పొరేషన్ అధికారుల సహకారంతో ఒంగోలు నగరాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. ఒంగోలు కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పాటు అయిన తర్వాత టీడీపీ బలంతో జరిగిన కౌన్సిల్ సమావేశం మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయ్‌కుమార్ ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం దామచర్ల మాట్లాడుతూ నగర అభివృద్ధి కోసం అవసరమై నిధులను ప్రభుత్వం నుంచి కోరుతామన్నారు. అలాగే సభ్యులంతా కలిసి అభివృద్ధి వైపు నడిచి, రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని కోరారు. తాను 2014 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కౌన్సిల్ లేకపోవడంతో హాజరు కాలేకపోయాయని, అయితే కౌన్సిల్ ఏర్పడిన తర్వాత సమావేశానికి తొలిసారి రావడం సంతోషంగా ఉందన్నారు. ఎంపీ మాగుంట మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా ఒంగోలు ఎంపీగా ఉన్నా నని, నగర అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించాన న్నారు. భవిష్యత్‌లో కూడా సహకరిస్తానని తెలిపారు. బీఎన్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ తన వంతుగా అవసరమైన నిధులు కేటాయించడంతోపాటు, నగర అభివృద్ధిలో భాగస్వామ్య అవుతానని తెలిపారు.