విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ట్రేడ్ యూనియనలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో విశాఖలోని నేతాజీ సర్కిల్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భం గా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పీ. శ్రీనివాసులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, సీపీఐ (ఎంఎల్) విశ్వనాధ్, ఎంఆర్‌పీఎస్ జాతీయ నాయకులు రామాంజనేయులు, రైతు సంఘాల జిల్లా ప్రధాన కార్య దర్శులు వంగిమళ్ల రంగారెడ్డి, బసిరెడ్డిలు మాట్లాడుతూ రూ.9 వేల కోట్ల పెట్టుబడికి 58 వేల కోట్ల డివిడెండ్ చెల్లించిన విశాఖ ఉక్కు పరిశ్రమను దొడ్డిదారిన ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఇందులో భాగంగానే బ్లాస్ట్ ఫర్నేస్ రెండింటిని ఉద్దేశపూర్వకంగా మూసివేశారని, 75 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం నుంచి 30 లక్షల టన్నులకు స్టీల్ ఉత్పత్తి పడిపో నుందని తెలిపారు.