ఇటువంటి అసమర్థ వ్యక్తి వైఎస్ జగన్ సీఎం ఎలా అయ్యారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఎక్స్ (X) వేదికగా ప్రశ్నించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి నాలుగేళ్లు నిండాయని, ఇప్పటికీ పూర్తిగా నిర్మాణం అయ్యింది ఒక్కటి లేదని, సగం పైగా పునాదుల దశలోనే ఉన్నాయని విమర్శించారు. కళాశాల హాస్టల్ భవనాలు పూర్తి చేయకుండానే గత సంవత్సరమే ఆర్భాటంగా రాజమండ్రి వైద్య కళాశాల ప్రారంభించారని, ఈ ఏడాది రెండో సంవత్సరం విద్యార్థులకు తాత్కాలిక భవనాలలోనే తరగతులు నడపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మెడికల్ కౌన్సిల్ జూలై నెలలోనే అనుమతి నిరాకరించిన విషయం తెలియదా? అంత ఎందుకు.. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాలేదని.. 48శాతం బోధనా సిబ్బంది లేరన్న విషయం మరిచారా? అని మంత్రి సత్యకుమార్ ప్రశ్నించారు. అనుమతి తీసుకుని విద్యార్థులను ఎక్కడ చదివించాలి? చెట్ల కింద?.. అమ్మాయిలను ఎక్కడ ఉంచాలి? షెడ్ల కింద?.. అని నిలదీశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఆడుకోవాలనుకున్నారంటూ దుయ్యబట్టారు. ఇటువంటి అబద్దాలను ప్రచారం చేస్తున్నారనే ప్రజలు వైసీపీకి 151 నుంచి 11 కు దించారని.. అయినా బుద్ధి తెచ్చుకోకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ మారాలని, ప్రజాభిప్రాయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని సూచించారు. లేదంటే ప్రజలు బెంగుళూరు పాలస్ దాకా తరిమికొడతారని మంత్రి సత్యకుమార్ అన్నారు.