ఏపీలో వరద బాధితుల కోసం విరాళాలు కొనసాగుతున్నాయి. వీవీఐపీలు, వీఐపీలతో పాటుగా వ్యాపార సంస్థలు, సామాన్య ప్రజానీకం కూడా బాధితులకు అండగా నిలుస్తూ విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే దివీస్ లాబోరేటరీస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు భారీ విరాళం అందించింది. వరద బాధితుల కోసం మొత్తం రూ.9.8 కోట్లను విరాళంగా అందించింది. విజయవాడలో వరదలు సంభవించిన వెంటనే బాధితులకు ఆహారం అందించేందుకు గానూ అక్షయపాత్ర ఫౌండేషన్‌కు దివీస్ ల్యాబోరేటరీస్ తక్షణ సాయం కింద రూ.4.8 కోట్లు అందించింది. తాజాగా ఇవాళ మరో రూ. 5 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించింది. దివీస్ సీఈవో కిరణ్.. మంత్రి నారా లోకేష్‌ను కలిసి రూ. 5 కోట్ల విరాళం తాలూకు చెక్ అందించారు.
మరోవైపు దివీస్ విరాళంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దివీస్ సీఈవో కిరణ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. "ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వరద సహాయక చర్యలకు ఉదారంగా ₹9.8 కోట్ల సహకారం అందించినందుకు దివీస్ ల్యాబొరేటరీస్‌కు ధన్యవాదాలు. వారి తక్షణ సహాయం, సహకారంతో అక్షయపాత్ర ఫౌండేషన్ వరద బాధితులకు చాలా ఉపశమనాన్ని అందించింది. ప్రజలకు అవసరమైన సమయంలో వారి పక్షాన నిలబడాలనే మా సంకల్పాన్ని బలోపేతం చేసింది." అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
మరోవైపు తెలంగాణ వరద బాధితులకు కూడా దివీస్ సంస్థ విరాళం అందించింది. వరద బాధితులకు ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసిన దివీస్ సీఈవో కిరణ్.. విరాళం తాలూకు చెక్కును ఆయనకు అందించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు దివీస్ సంస్థ చేస్తున్న సాయాన్ని రేవంత్ రెడ్డి అభినందించారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలు వరదల కారణంగా ఇబ్బందుల పడగా.. ఆదుకునేందుకు అనేక చేతులు ముందుకు వస్తున్నాయి. రంగాలకు అతీతంగా సినిమా స్టార్లు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. తమకు చేతనైన సాయం చేస్తున్నారు.