అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం గిరిజన గురుకుల కళాశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 44 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో వారందరినీ అంబులెన్సులో రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు. అయితే అస్వస్థతకు కారణం కలుషితాహారమో, మరొకటో అనుకుంటే పొరబాటే. చెప్పిన మాట వినడం లేదనే కారణంతో ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరే దీనికి కారణమని బాధిత విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తమతో వరుసగా రెండు రోజులపాటు వంద గుంజీలు చొప్పున తీయించారని ఆరోపిస్తున్నారు. దీంతో నడవడానికి కూడా కాళ్లు సహకరించడం లేదని ఆరోపిస్తున్నారు. మొత్తం 44 మంది విద్యార్థినులు ఈ రకంగా ఇబ్బంది పడ్డారు.
దీంతో వారందరినీ అంబులెన్సులో రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు విద్యార్థినుల పట్ల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరుపై విద్యార్థినుల కుటుంసభ్యులు మండిపడుతున్నారు. చెప్పిన మాట వినకపోతే దండించడం వరకూ సరే కానీ.. మరీ ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. గుంజీలు తీయడంతో కాళ్లు వాపులు వచ్చి విద్యార్థినులు నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినుల పట్ల అమానుషంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు డోలీలో మృతదేహాన్ని తరలించిన హృదయవిదారక ఘటన పాడేరులో చోటుచేసుకుంది. తుమ్మపాలెం గ్రామానికి చెందిన నాగరాజు అనే 32 ఏళ్ల యువకుడు అనారోగ్యంతో విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రిలో కన్నుుమూశాడు. మృతదేహాన్ని స్వస్థలం తరలించాల్సి రాగా.. అంబులెన్స్‌లో కేజీహెచ్ నుంచి బయల్దేరారు. అయితే రోడ్డు సౌకర్యం తుమ్మపాలెం వరకూ లేకపోవటంతో.. కొంత దూరం వరకూ మాత్రమే అంబులెన్సులో తీసుకువచ్చారు. ఆ తర్వాత డోలీలో మోసుకుంటూ గెడ్డ దాటి ఇంటికి చేర్చారు. భారీ వర్షాలకు గెడ్డ పొంగి ప్రవహిస్తూ ఉండటంతో సుమారుగా మూడు కిలోమీటర్ల దూరం డోలీలోనే మృతదేహాన్ని తరలించాల్సి వచ్చింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూడగా.. ప్రభుత్వాలు, పాలకులు మారినా కూడా మన్యం ప్రాంత వాసుల కష్టాలు తీరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.