విశాఖపట్నంలో మరో వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే విశాఖపట్నం నుంచి మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తుండగా.. ఇది నాలుగోది. విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యన రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అలాగే విశాఖపట్నం భువనేశ్వర్ మధ్య మరో వందే భారత్ రైలు నడుస్తోంది. తాజాగా సోమవారం విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ రైలును కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించగా.. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. మరోవైపు విశాఖపట్నం నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే తొలి సెమీ హైస్పీడ్ రైలు ఇదే కావటం విశేషం. విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం మినహా వారంలో ఆరు రోజులు నడుస్తుంది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది.
మరోవైపు విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ రైలును ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఏపీకి శుభవార్త వినిపించారు. విశాఖ రైల్వేజోన్‌కు త్వరలోనే భూమిపూజ నిర్వహిస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విజయదశమి(దసరా) పండుగ పూర్తైన తర్వాత.. మంచి ముహూర్తం చూసుకుని పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. దీంతో పదేళ్లుగా ఎదురుచూస్తున్న ఎదురుచూపులకు దసరా తర్వాత తెరపడనుంది. మరోవైపు విశాఖపట్నం నుంచి నడుస్తున్న నాలుగో వందే భారత్ రైలు ఇదని చెప్పిన మంత్రి.. వందే భారత్ స్లీపర్ రైళ్లను సైతం త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. వందే భారత్ స్లీపర్ రైళ్ల ద్వారా మేకిన్ ఇండియా సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేస్తామని మంత్రి చెప్పారు.
మరోవైపు విశాఖపట్నం రైల్వే జోన్‌కు సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రైల్వే జోన్ కార్యాలయం కోసం ఏపీ ప్రభుత్వం ముడసర్లోవ వద్ద ఇప్పటికే 52 ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలోనే రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే అప్పటి నుంచి భూమి సమస్యతో ఈ వ్యవహారం సాగుతూనే ఉంది.