ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన పార్టీ నేత జానీ మాస్టర్‌కు జనసేన పార్టీ షాక్ ఇచ్చింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. రాయదుర్గం పోలీస్ స్టే్షన్‌లో కేసు నమోదైన విషయాన్ని ప్రస్తావించిన జనసేన.. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. మరోవైపు తక్షణమే తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయంటూ అధికారిక ప్రకటనను జనసేన విడుదల చేసింది. మరోవైపు జానీ మాస్టర్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈమె.. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ చర్యలు తీసుకుంది. కేసు నమోదైన నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. మరోవైపు ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు జానీ మాస్టర్. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన జానీ మాస్టర్.. ఆ పార్టీ తరుఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ఓ దశలో నెల్లూరు జిల్లాలో ఏదో ఒక స్థానంలో ఆయన పోటీచేస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జానీ మాస్టర్.. జనసేన పార్టీ అభ్యర్థుల తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మరోవైపు జానీ మాస్టర్ మీద జనసేన పార్టీ చర్య తీసుకోవటంతో.. జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ గురించి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల పలుచోట్ల కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఓ చోట జరిగిన కార్యక్రమంలో జానీ మాస్టర్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అని చెప్పిన జానీ మాస్టర్.. 2029లో కచ్చితంగా సీఎం అవుతారని జోస్యం చెప్పారు. అలాగే 2034లో పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి అవుతారంటూ జనసేనానిని కొనియాడుతూ ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ లోపే జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావటం, కేసు నమోదు కావటం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించడం జరిగిపోయాయి.