ఏపీలో కూటమి నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్నప్పటికీ.. ఇంకా నామినేటెడ్ పదవుల భర్తీని ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో అవకాశం రాని నేతలు, పొత్తుల లెక్కల్లో సీటు కోల్పోయిన నేతలు నిరుత్సాహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి నామినేటెడ్ పదవిని భర్తీ చేసింది. తద్వారా నామినేటెడ్ పదవుల భర్తీ ప్రారంభించింది. దసరాలోగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలిసింది.
ఇక అసలు సంగతిలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా పి. కృష్ణయ్యను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణయ్య.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఐఐసీ ఛైర్మన్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితులు. అలాగే చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగానూ పనిచేస్తున్నారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసిన ఆయన.. ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. గుంటూరు, రంగారెడ్డి జిల్లాలకు జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. మహబూబ్‌నగర్, చిత్తూరు జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. అలాగే ముఖ్యమంత్రి వద్ద జాయింట్ సెక్రటరీగానూ వ్యవహరించారు.తాజాగా కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
ఇక ఉత్తర్వులు రాగానే కృష్ణయ్య బాధ్యతలు కూడా స్వీకరించారు. దీంతో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భర్తీ చేసిన తొలి నామినేటెడ్ పదవి ఇదే అయ్యింది. ఈ నేపథ్యంలోనే మిగతా నామినేటెడ్ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. నామినేటెడ్ పదవులను టీడీపీకి 60 శాతం, జనసేనకు 30 శాతం, బీజేపీకి 10 శాతం చొప్పున కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రాని ముఖ్య నేతలు వీటిపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు గతంలో చెప్పారు. ఆ ప్రకారమే ఎవరికి ఏ పదవిని అప్పగించాలనే దానిపైనా ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది.
అయితే ఈలోపే విజయవాడలో వరదలు రావటంతో నామినేటెడ్ పదవుల భర్తీ ఆగిపోయింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో.. మరోసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేయడంపై ఫోకస్ పెట్టారు. మరోవైపు మైలవరం నుంచి పోటీ చేయడానికి అవకాశం రాని సీనియర్ లీడర్ దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆర్టీసీ ఛైర్మన్, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ ఛైర్మన్, పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, పట్టాభికి పౌర సరఫరాల కార్పొరేషన్ పదవులు ఇస్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది.