బుడమేరు వరద ఉధృతికి ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని మంత్రి నారాయణ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతం మునిగిపోయిందని వైసీపీ అసత్య ప్రచారాలు చేసిందని.. రాజధాని పరిసర ప్రాంతాలకి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి ఇలాంటి ఇబ్బందులు తలేత్తకుండా మూడు వాగులని స్టోరేజ్ కెపాసిటీ పెంచుతున్నామని.. అందులో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్‌ను డిజైన్ చేస్తున్నామని తెలిపారు. వచ్చే రెండు నెలలో టెండర్లు వేసి పనులు ప్రారంభించి వచ్చే వర్షా కాలం లోపు పూర్తి చేస్తామని తెలిపారు. కెనాల్స్ కాకుండా ఇంకా రిజర్వాయర్స్‌ను కూడా డిజైన్ చేయటం జరుగుతుందన్నారు. ఎక్కువ వరద వస్తే రిజర్వాయర్స్‌కు పంపించటం జరుగుతుందన్నారు. ఇలాంటివి చేయటం వల్ల అమరావతి రాజధానికి ఎలాంటి ముప్పు ఉండదన్నారు. కరకట్టను నాలుగులైన్లతో గతంలో డిజైన్ చేశామన్నారు. ఐకాన్ బిల్డింగ్స్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవని ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చారన్నారు.