నరసాపురం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు నిధులు కేటాయించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన రెండ్రోజుల్లోనే రూ.1.74కోట్లు మంజూరు చేయడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని పవన్ కొనియాడారు. ఈ మేరకు డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి కృషి చేసిన నరసాపురం మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందికి ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు.నరసాపురం ప్రజలు డంపింగ్ యార్డ్ లేక దశాబ్దాలుగా అవస్థలు పడ్డారని, పెండింగ్‌లో ఉండిపోయిన ఆ సమస్యకు అధికారులు పరిష్కారం చూపడం సంతోషంగా ఉందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. మున్సిపాలిటీ అధికారులంతా డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించాలంటూ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని, ఈ మేరకు స్పందించిన సీఎం రెండ్రోజుల్లోనే భూమి కొనుగోలుకు రూ.1.74కోట్లు అత్యవసర నిధి కింద విడుదల చేశారని తెలిపారు. ఇది సీఎం చంద్రబాబు, ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి, అధికారుల వృత్తి నిబద్ధతకు నిదర్శనమని డిప్యూటీ సీఎం పవన్ కొనియాడారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నరసాపురం మున్సిపాలిటీకి దశాబ్దాలుగా సరైన డంపింగ్ యార్డ్ లేకపోవడంతో సేకరించిన చెత్తను గోదావరి గట్టునే పోస్తున్నారని, దీంతో నదీజలాలు కలుషితం అయ్యాయని డిప్యూటీ సీఎం చెప్పారు. ప్రజలు ఆ నీటినే తాగి అనారోగ్యం బారిన పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. నరసాపురం ప్రజలకు ఎన్నికల హామీ మేరకు అతి తక్కువ సమయంలోనే పరిష్కారం చూపడం ఆనందంగా ఉందన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు డంపింగ్ యార్డును వెంటనే మరో చోటకు తరలించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గోదావరి తీరాన్ని 2027 పుష్కరాల నాటికీ రివర్ ఫ్రంట్ పనుల్లో భాగంగా సుందరీకరణ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యే శ్రీ బొమ్మిడి నాయకర్, పురపాలకశాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పీయూష్ కుమార్, పురపాలక శాఖ కమిషనర్, డైరక్టెర్ శ్రీ హరినారాయణ్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగరాణి, నరసాపురం ఆర్డీవో డా.అంబరీష్‌ను పవన్ కల్యాణ్ అభినందించారు.