ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్‌పై బయటికి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్.. సంచలన ప్రకటన చేశారు. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. ప్రజాకోర్టులోనే నెగ్గుతానని ధీమా వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటించిన కేజ్రీవాల్.. రేపు సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రం సమర్పించనున్నారు. ఇక కేజ్రీవాల్ రాజీనామా చేస్తే.. ఢిల్లీ సీఎం పగ్గాలు ఎవరు చేపడతారు అనేది రాజకీయ వర్గాల్లోనే కాకుండా.. ఢిల్లీ ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అపాయింట్‌మెంట్‌ను.. ఇప్పటికే తీసుకున్న కేజ్రీవాల్.. ఆయనను కలిసి తన రాజీనామా లేఖను అందించనున్నారు. అంతకుముందే ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ ఖరారు చేయనుంది. ఇందుకోసం మంగళవారం ఉదయమే సీఎం అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఉదయం 11.30 గంటలకు ఆప్ ఎమ్మెల్యేలంతా సమావేశమై.. ఢిల్లీకి తర్వాతి సీఎం ఎవరు అనేది ఖరారు చేయనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకున్న తర్వాత.. మంగళవారం సాయంత్రం వరకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే ఉన్నాయని ఆప్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మరోవైపు.. కేజ్రీవాల్ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో పలువురు ఆప్ నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్‌తోపాటు ఆప్ మంత్రులు అతిషీ మార్లేనా, సౌరభ్ భరద్వాజ్, ఎంపీ రాఘవ్ చద్దా పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక మిగిలిన నేతల పేర్లు కూడా వస్తున్నా.. ఈ నలుగురిలోనే ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే.. సీఎం ఎంపిక విషయంలో అరవింద్ కేజ్రీవాల్ చాలా కీలకంగా వ్యవహారించాల్సిన అవసరం ఉంది. దీంతో ఆయన ఆచూతూచి అడుగులు వేస్తున్నారు.
ఇక సోమవారం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన.. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ ఆప్ నేతలు, మంత్రులు హాజరయ్యారు. తదుపరి సీఎం ఎంపిక విషయంలో మంత్రులందరితో.. కేజ్రీవాల్ వేర్వేరుగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలతో కూడా చర్చించి.. ముఖ్యమంత్రిని ఫైనల్ చేయనున్నారు.