కేరళలోని మలప్పురం జిల్లాలో నిపా వైరస్ అలజడి రేపుతోంది. నిపా వైరస్‌తో రెండో మరణం సంభవించడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది గుమిగూడవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మెడికల్ షాపులు మినహా మిగిలిన అన్ని షాపులకు ఆంక్షలు విధించారు. కిరాణాషాపులను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించారు. తిరువల్లి, మంపట్ గ్రామ పంచాయతీల పరిధిలో కఠిన ఆంక్షలను విధించారు. సినిమా థియేటర్లను మూసివేశారు. వివాహాలు, ఇతర శుభకార్యాలను వాయిదా వేసుకోవాలని.. తప్పనిసరి అయితే, పరిమితమైన మందితో నిర్వహించుకోవాలని అధికారులు సూచించారు. సామాజిక దూరం పాటించాలని ఆదేశించారు.
జ్వరం లాంటి లక్షణాలు వస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు ఆదేశించారు. సొంత వైద్యం మానుకోవాలని హెచ్చరించారు. పాఠశాలలు, కాలేజీలు, మదర్సాలు, అంగన్‌వాడీలు, ట్యూషన్ సెంటర్‌లతో పాటు అన్ని విద్యాసంస్థలను మూసివేశారు.
జంతువులు కొరికిన, చెట్ల నుంచి పడిపోయిన పండ్లను తినవద్దని మలప్పురం జిల్లా అధికారులు ప్రజలకు సూచించారు. పండ్లను, కూరగాయలను శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలని సూచించారు. ప్రజలు కలుషితమైన పండ్లను తినకుండా ఉండాలని, జ్వరం లాంటి లక్షణాలుంటే, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.
మలప్పురంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 24 ఏళ్ల యువకుడు నిపా వైరస్ లక్షణాలతో మరణించాడు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.. ఆదివారం (సెప్టెంబర్ 15) ఈ విషయాన్ని ధృవీకరించారు. సెప్టెంబర్ 9న బెంగళూరు నుంచి కేరళకు తిరిగొచ్చిన మలప్పురంవాసి తీవ్రమైన జ్వరం బారినపడి మరణించాడు. స్థానిక వైద్యుడు నిపా వైరస్ లక్షణాలుగా అనుమానించడంతో అతడి నమూనాలను సేకరించి కోజికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ల్యాబొరేటరీకి పంపించారు. అనంతం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిపా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధారించింది. దీంతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం మలప్పురం జిల్లాలో కఠిన ఆంక్షలను విధించింది.
నిపా వైరస్ అంటే ఏమిటి?
నిపా వైరస్ అనేది జూనోటిక్ వైరస్. అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. సాధారణంగా గబ్బిలాలు, పందుల నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తుంది. ఫ్రూట్ బ్యాట్స్ (గబ్బిలాలు) నిపా వైరస్‌కు సహజ అతిథేయులు. ఈ గబ్బిలాలు కొరికేసిన పండ్లను తిన్నప్పుడు మనుషులకు నిపా వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరి వ్యాప్తి చెందుతుంది.
నిపా వైరస్ వ్యాధి లక్షణాలు:
★ తొలుత జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటాయి.
★ వాంతులు, గొంతు బొంగురుపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి.
★ ఆ తర్వాత వైరస్ మెదడుపై ప్రభావం చూపుతుంది, మత్తుగా ఉండటం, మెదడు దెబ్బతినడం, వణికిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
★ న్యుమొనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. రోగి 24 గంటల నుంచి 48 గంటల్లో కోమాలోకి చేరుకొని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.