ప్రతిపక్ష పార్టీలు తనకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేశాయంటూ బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాను ప్రధాని రేసులో ఉంటే మద్దతు ఇస్తామని ప్రతిపక్ష పార్టీలు 2024 లోక్‌సభ ఎన్నికల ముందు తనకు ఓ ఆఫర్ ఇచ్చినట్లు ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు.. రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని పదవిపై నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గానికి చెందిన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి పదవి కోసం.. ప్రతిపక్షాలను సాకుగా చూపించి నరేంద్ర మోదీకి.. నితిన్ గడ్కరీ ఒక సందేశాన్ని పంపుతున్నారని ఆమె మండిపడ్డారు.
ప్రతిపక్ష పార్టీలను సాకుగా చూపించి.. నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి పదవిపై తనకు ఉన్న ఆసక్తిని.. నరేంద్ర మోదీకి ఒక మెసేజ్ రూపంలో పంపించారని ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీకి కూడా ఆమె కౌంటర్ ఇచ్చారు. ఇండియా కూటమిలో దేశాన్ని నడిపించే సమర్థవంతమైన నాయకులు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. బీజేపీ నుంచి ఒకరిని కొనుగోలు చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. చాలా మంచి ఆట ఆడారు నితిన్ గడ్కరీ అంటూ ప్రియాంక చతుర్వేది తాజాగా ఓ ట్వీట్ చేశారు.
శనివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నిర్వహించిన జర్నలిజం అవార్డ్స్ కార్యక్రమానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని.. అయితే దాన్ని తాను వద్దు అనుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి పోటీలో ఉంటే.. ప్రతిపక్ష పార్టీలు కూడా తనకు మద్దతు ప్రకటిస్తానని ఆఫర్ చేశాయని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ నాయకుడు తన వద్దకు వచ్చి... తాను ప్రధాని పదవి రేసులో నిలబడితే వారంతా మద్దతు ఇస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ తనకు ప్రధానమంత్రి కావడం అనేది లక్ష్యం కాదని.. తాను అనుకున్నదానికి ఎల్లప్పుడూ తాను కట్టుబడి ఉంటానని సదరు ప్రతిపక్ష పార్టీ నేతకు తేల్చి చెప్పినట్లు నితిన్ గడ్కరీ వివరించారు.
అయితే ఆ వ్యక్తిని తాను కొన్ని ప్రశ్నలు అడిగినట్లు చెప్పారు. మీరు ఎందుకు నాకు మద్దతు తెలుపుతున్నారు.. మీ మద్దతు తీసుకోవాల్సిన అవసరం నాకేముంది అని ప్రశ్నించినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి కావడం నా జీవిత లక్ష్యం కాదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా తన నమ్మకం, సంస్థకు విధేయత చూపుతానని.. ఎలాంటి పదవి వచ్చినా తన సిద్ధాంతాలను పక్కనబెట్టనని చెప్పారు. అన్నింటికన్నా తన నమ్మకమే తనకు ఎక్కువ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ అవార్డ్స్‌ల కార్యక్రమంలో మాట్లాడిన నితిన్ గడ్కరీ.. రాజకీయాల్లో, జర్నలిజంలో విలువలు అనేవి చాలా ముఖ్యం అని ఆయన గుర్తు చేశారు.