ఇజ్రాయేల్పై హౌతీ రెబల్స్ మరోసారి దాడికి పాల్పడ్డారు. ఆదివారం యెమెన్ భూభాగం నుంచి హౌతీ ఉగ్రవాదులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి.. టెల్ అవీవ్ సమీపంలోని ఓ వాణిజ్య ప్రదేశంలోకి దూసుకొచ్చింది. దీంతో ఇజ్రాయేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్రైడ్ సిగ్నల్స్ మోగాయి. హమాస్-ఇజ్రాయేల్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఈ సిగ్నల్స్ మోగడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకునేందుకు భయన పరుగులు తీశారు. అయితే, కొద్దిసేపటికే విమాన సేవలను పునరుద్ధరించినట్టు అధికారులు ప్రకటించారు. క్షిపణి తాకిన ప్రదేశంలో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. సమీపంలో రైల్వే స్టేషన్‌లోని అద్దాలు పగిలి.. పలువురికి గాయాలైనట్టు పేర్కొన్నారు.
ఇంటర్ సెప్టార్ల నుంచి భారీ శబ్దాలు వచ్చాయని ఇజ్రాయేల్ సైన్యం తెలిపింది. గగనతల రక్షణ వ్యవస్థ ద్వారా బాలిస్టిక్ క్షిపణిని దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రకటించింది. ఈ క్షిపణి దాడికి హౌతీలు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని, వారిపై బదులు తీర్చుకుంటామని ఇజ్రాయేల్ హెచ్చరించింది. క్యాబినెట్ సమావేశంలో ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తమ దేశానికి హాని కలిగిస్తే ఏంజరుగుతుందో ఇప్పటికే హౌతీలకు అర్థమై ఉండాలని ఆయన అన్నారు.
ఒకవేళ తెలియకుంటే ఒక్కసారి యెమెన్‌లోని హౌదైరా పోర్ట్‌ను సందర్శించాలని హెచ్చరికలు చేశారు. మరోవైపు, టెల్-అవీవ్లో భాగమైన జాఫాలో ఇజ్రాయేల్ సైనిక స్థావరమే లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించినట్టు హౌతీ రెబల్స్ ప్రతినిధి జనరల్ యాహ్యా సారీ ప్రకటించారు. తాజా దాడితో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. కానీ, హౌతీలకు సుదీర్ఘ దూరంలోని లక్ష్యాలను చేరుకునే బాలిస్టిక్ క్షిపణి ఎలా వచ్చింది? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే హౌతీల సామర్థ్యం వెనుక ఇరార్ మద్దతు, ఆయుధాల అక్రమ రవాణా అంశం ముడిపడి ఉంది. అధికారికంగా అన్సార్ అల్లాగా పిలిచే ఈ బృందం.. 1990వ దశకంలో అట్టడుగు స్థాయి మత ఉద్యమం నుంచి అధునాతన ఆయుధాలతో శక్తివంతమైన మిలీషియాగా పరిణామం చెందింది. 2015లో యెమెన్ అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి హౌతీలు క్షిపణిల తయారీకి మూడు ప్రాథమిక వనరులపై ఆధారపడ్డారు: ఒకటి యెమెన్ ప్రభుత్వ ఆయుధ గారాల లూటీలు, ఇరాన్ ఆర్ధిక మద్దతు, ఆయుధ తయారీలో శిక్షణతో అధునాతన క్షిపణులను హౌతీ తిరుగుబాటుదారులు సమకూర్చుకున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక, ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విడిపోయిన యెమెన్‌కు అగ్రరాజ్యాల నుంచి సైనిక సహాయం లభించింది. యెమెన్ ప్రభుత్వం 1970లలో సోవియట్ యూనియన్ నుంచి స్కడ్ క్షిపణులను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. యెమెన్ సైనిక ఆయుధ నిల్వల్లోకి వివిధ బాలిస్టిక్, ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు ఉత్తర కొరియా, ఇరాన్, సౌదీ అరేబియా, అమెరికా సహా పలు దేశాల నుంచి వచ్చి చేరాయి.
వీటిని 1994 అంతర్యుద్ధంలో అక్కడ ప్రభుత్వం వినియోగించింది. కానీ, 2000లలో హౌతీలు ప్రాబల్యం మొదలయ్యే నాటికే వారి వద్ద బాలిస్టిక్ క్షిపణులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 2004- 2010 మధ్య, హౌతీలు ఆయుధ డిపోలపై దాడి చేసి భారీ ఆయుధాలను దోచుకున్నారు. అయినప్పటికీ 2015 వరకు యెమెన్ మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్.. హౌతీలతో అంటుకాగడం వారి క్షిపణి సామర్థ్యాన్ని మరింత గణనీయంగా విస్తరించేందుకు దోహదపడింది.