నూతన మద్యం పాలసీ పై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తో సచివాలయం వేదికగా మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది.ఈ నేపథ్యంలో వారు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం కొత్త మద్యం పాలసీని కేబినెట్ ఎదుట ప్రవేశ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.'6 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించాం.. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు ఇస్తాం.. గత ప్రభుత్వంలో మద్యం ధరలను విపరీతంగా పెంచారు.. మద్యం రేట్ పెరగడంతో పేదలు గంజాయికి అలవాటుపడ్డారు.. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తాం' అని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. పలు మార్పులు చేర్పులతో పాటు తదుపరి కార్యాచరణపై మంత్రివర్గ ఉప సంఘానికి సీఎం పలు సూచనలు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గురువారంలోపు దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంది. కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించిన అనంతరం నూతన మద్యం విధానాన్ని ఖరారు చేయనున్నారు.