విజయవాడలో భారీ వరదలు వచ్చాక పది రోజుల్లోనే మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడం ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యమయిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇది తాను మాత్రమే చెప్పడం లేదని... వరదల వల్ల ఇబ్బంది పడిన ఏ ఒక్కరిని అడిగినా చెపుతారని అన్నారు. సీఎం హోదాలో ఉండి కూడా ఒక సామాన్యుడిలా ఇంటింటికీ వెళ్లి అందరినీ కలిసి వారిలో భరోసాను కల్పించారని చెప్పారు. 75 ఏళ్ల వయసులో కూడా కష్టపడే మనస్తత్వం ఉన్న చంద్రబాబు సీఎంగా దొరకడం ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. రాష్ట్రం కోసం చంద్రబాబు ఇంతగా కష్టపడుతుంటే... వైసీపీ రాజకీయాలు చేస్తోందని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. వాళ్లు ఏం చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదని.. అందుకే సహించలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు పద్ధతి మార్చుకోవాలని... లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావని అన్నారు. విపత్తులు సంభవించినప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పని చేయాలని చెప్పారు.