ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి చంద్రబాబు అని... ఇక ఆయన పరివారం ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదని వ్యాఖ్యానించారు. సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదన్నది నానుడి అని పేర్కొన్నారు. పాలకులకి ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదని... చట్టం ముందు అందరూ సమానులేనని వివరించారు. సీఎం చంద్రబాబే పర్యావరణపరంగా సున్నితమైన కృష్ణానది ఒడ్డుఫై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్నప్పుడు... బుడమేరు రివలెట్ పై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం ఆయనకు ఎక్కడుందని ప్రశ్నించారు. చంద్రబాబు నివసించే అక్రమ కట్టడం మొదట కూలగొట్టడం సముచితమని పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ నివాసాన్ని కూల్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మరో ట్వీట్ ద్వారా విజయసాయి స్పందిస్తూ... ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికీ ప్రతిపక్షం మాదిరే వ్యవహరిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి పాలకపక్షంగా బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. భవిష్యత్తుపై ఎలాంటి విజన్ లేకుండా... గత ప్రభుత్వంపైనే పూర్తిగా ఫోకస్ చేస్తోందని మండిపడ్డారు. అధికారపక్షం మేలుకోవాలని... రాష్ట్ర ప్రజల కోసం పని చేయాలని హితవు పలికారు.