దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. బుల్డోజర్ న్యాయాన్ని తక్షణమే ఆపాలని ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీ వరకు బుల్డోజర్ కూల్చివేతలు ఆపాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. నిందితులు చేసిన పనికి ఇప్పటికిప్పుడు బుల్డోజర్ న్యాయం అందించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఏదైనా నేరం జరిగిన తర్వాత విచారణలో ఉన్న నేరగాళ్ల ఇళ్లు, ప్రైవేటు ఆస్తులపైకి బుల్డోజర్లను పంపించి కూల్చివేసి.. ఆ కేసులో బాధితులకు ఉపశమనం ఇవ్వడం, దేశ వ్యాప్తంగా మార్గదర్శకాలు తయారు చేయడంపై మంగళవారం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. ఈ కూల్చివేతలను ఆపితే ఆక్రమణల తొలగింపు ఆలస్యం అవుతుందని ప్రభుత్వం ప్రశ్నలు లేవనెత్తగా.. వచ్చేనెల 1వ తేదీ వరకు కూల్చివేతలు ఆపినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు సుప్రీంకోర్టు పేర్కొంది.
అయితే ఇప్పటికే ఈ బుల్డోజర్ కూల్చివేతలపై నెల రోజుల్లోనే 2సార్లు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కూల్చివేతలను హీరోయిజంగా చూపించే ప్రయత్నం చేయవద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేయవద్దని తేల్చి చెప్పింది. వీటిపై ఎన్నికల కమిషన్‌కు కూడా నోటీసులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీటిలో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.
అదే సమయంలో బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపు విషయంలో మాత్రం తమ ఆదేశాలు వర్తించవని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, సీయూ సింగ్ వాదనలు వినిపించారు. ఇప్పటికే సెప్టెంబర్ 2వ తేదీన జరిగిన వాదనల్లో దేశంలో ఎక్కడా ఈ తరహా చర్యల్లో మార్గదర్శకాలను పాటించడం లేదని వారు కోర్టుకు విన్నవించారు. ఈ కూల్చివేతల కేసులో జామత్ ఉలేమా హింద్ ప్రధాన పిటిషనర్‌గా వ్యవహరిస్తోంది. కూల్చివేతలకు ముందు కనీసం 40 నుంచి 60 రోజుల ముందుగా నోటీసులు జారీ చేయాలని.. చట్ట వ్యతిరేక కూల్చివేతలకు సదరు అధికారులను బాధ్యులను చేయాలని జామత్ ఉలేమా హింద్ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తున్నారు.