ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 75వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పారు. ఒడిశాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ పలు ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం ప్రకటించిన సుభద్ర యోజనను ప్రారంభించారు. ఈ పథకం కింద ఒడిశాలోని అర్హులైన మహిళలకు ఏటా రూ.10 వేలు.. రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ క్రమంలోనే సుభద్ర యోజనకు ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపారు. ఇప్పటికే ఈ సుభద్ర యోజన కింద 60 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా.. ఒడిశా ప్రభుత్వం కూడా నిధులు కేటాయించింది.
ఈ సుభద్ర యోజన కింద ఒడిశాలోని కోటి మంది లబ్ధిదారుల మహిళల ఖాతాల్లో రూ.10 వేలు వేయనున్నారు. రెండు విడతల్లో రూ.5 వేల చొప్పున ఏటా మొత్తం ఒక్కో మహిళ అకౌంట్లో రూ.10 వేలు వేయనున్నారు. ఒడిశాలో మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ సుభద్ర యోజనను తీసుకువచ్చింది. ఇవాళ ఒడిశాలోని రైల్వే, నేషనల్ హైవే ప్రాజెక్ట్స్‌ను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని మోదీ.. ఈ సుభద్ర యోజనను ప్రారంభించారు. అయితే సుభద్ర యోజనకు.. ఒడిశా బీజేపీ సర్కార్ ఆ పేరే పెట్టడానికి ఒక కారణం కూడా ఉంది. సుభద్ర మాత ఒడిశా ప్రజలచే నిత్యం పూజలందుకునే జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి సోదరి. అందుకే ఈ పేరు పెట్టినట్లు ఒడిశా బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ సుభద్ర యోజన కింద ఒడిశాలోని 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులోపు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. 2024-25 నుంచి 2028-29 వరకూ 5 ఏళ్ల పాటు ఏటా రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 2 విడతలుగా రూ.10 వేలు జమ చేయనున్నారు. ఇక ప్రధాని మోదీ చేతుల మీద ప్రారంభంచిన ఈ సుభద్ర యోజన కింద మంగళవారం రోజున ఒడిశాలోని 10 లక్షల మంది మహిళల అకౌంట్లలో నగదు జమ చేశారు.
సుభద్ర యోజన కోసం ఒడిశా ప్రభుత్వం సుమారు రూ.55,825 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ఈ సుభద్ర యోజనలో 60 లక్షల మంది మహిళలు రిజిస్టర్ చేసుకున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న మహిళల ఖాతాల్లో మంగళవారం తొలి విడత నగదు జమ చేశారు. ఇక ఒడిశాలోని ప్రభుత్వ పథకాల ద్వారా ఏడాదికి రూ.18 వేలు పొందే మహిళలు ఈ సుభద్ర యోజనకు అర్హులు కాదని సర్కార్ స్పష్టం చేసింది.