ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీపై మహారాష్ట్రకు చెందిన శివసేన ఎమ్మెల్యే (షిండే వర్గం) సంజయ్ గైక్వాడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ. 11 లక్షలు బహమతిగా ఇస్తానని ఆయన ప్రకటించారు. దీంతో తీవ్ర దుమారం రేగుతోంది. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడా రిజర్వేషన్ల అంశం గురించి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేయాలని రాహుల్ గాంధీ అన్నారని బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు.
తాజాగా, దీనిపై శివసేన షిండే ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇటీవల అమెరికాలో పర్యటించిన రాహుల్ గాంధీ ఓ సమావేశంలో రిజర్వేషన్లను పూర్తిగా అంతం చేయాలని వ్యాఖ్యలు చేశారు... రిజర్వేషన్ల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి ఆ వ్యాఖ్యలే నిదర్శనం.. కాబట్టే ఆయన నాలుక కోసిన వారికి నజరానా ప్రకటిస్తున్నాను’ అని సంజయ్ గైక్వాడ్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. ఆయన నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందని మండిపడ్డారు.
ఒకవైపు మహారాష్ట్రలో రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేస్తోన్న నోటితోనే.. దేశంలో రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేయాలని అంటున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బూల్దానా పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, అమెరికా పర్యటనలో రిజర్వేషన్లపై రాహుల్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలోని బలహీన వర్గాలకు వ్యవస్థల్లో తగిన ప్రాధాన్యత దక్కేలా చూడాల్సి ఉందన్నారు.
‘ప్రస్తుతం భారత్‌లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదు... అప్పటివరకు అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది.. దేశంలో అన్ని వర్గాల వారికీ పారదర్శకంగా అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చిన తర్వాతే రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.