వంద రోజుల్లో ఆరు ముఖ్య హామీల్లో ఐదింటిని సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల సహకారంతో నిలబెట్టుకోగలిగానని ఎంపీ మహేశ్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, పోలవరం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసరావు, రాష్ట్ర పామాయిల్ రైతుల అధ్యక్షుడు రాఘవరావు, తెలుగు రైతు అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావులతో కలిసి మాట్లాడారు. ‘వేలాది మంది రైతులు ఎదురు చూస్తున్న పామాయిల్ మద్దతు ధర ఒక నిర్దిష్ట స్థాయికి చేరేలా ఢిల్లీలో నేను చేసిన ప్రయత్నాలన్నీ కొలిక్కివచ్చాయి. పామాయిల్ దిగుమతి సుంకం 25 నుంచి 27.5 శాతం విధింపు ద్వారా రైతులకు అత్యధిక లబ్ధి కలుగుతుం దని కేంద్ర మంత్రులు, కార్యదర్శులతోపాటు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాను. సీఎం నీతి ఆయోగ్ సమావేశంలో దీనిని చర్చించడంతో తగు నిర్ణయం తాజాగా వెలువడింది. ఇది వంట నూనెలను ఉత్పత్తి చేస్తున్న రైతులందరికీ ప్రోత్సాహకరమే. అలాగే కేంద్ర అధికారులతో చర్చించి వర్జీనియా పొగాకు రైతులకు రూ.110 కోట్ల మేర లబ్ధి చేకూర్చగలిగాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రంతో చర్చించేం దుకు నాలుగు సార్లకు పైగా సీఎం చంద్రబాబు ఢిల్లీకి వచ్చారు. ప్రధాని తోపాటు ముఖ్య నేతలతో చర్చించడం ద్వారా కలిసొచ్చి ప్రాజెక్టు పనులకు రూ.12,500 కోట్లు సహాయం ప్రకటించడమే కాకుండా ఆరు వేల కోట్లు మంజూరయ్యాయి. రైల్వే మంత్రులు, అధికారులతో చర్చించి ఏలూరులో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నిలుపుదల హామీని నెరవేర్చాను. నేను గెలిస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చాను. తాజాగా ఏలూరులో జాబ్ మేళా నిర్వహించి 526 ఉద్యోగాలను నిరుద్యోగులకు వచ్చేలా చూశాం. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు అందుకునేలా ముందుకు వెళ్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర పామాయిల్ రైతుల అధ్యక్షుడు రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పామాయిల్ పండించే రైతులకే కాకుండా నూనె గింజలు పండించే రైతులందరికీ ఎంపీ తీసుకున్న చొరవ ఉపయుక్తమవుతుందని హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రైతులు ఆశించినట్టు సమస్యల పరిష్కారంలో యువ ఎంపీగా ఢిల్లీలో, నియోజకవర్గ పరిధిలోను రాణించారని కితాబు ఇచ్చా రు. పామాయిల్ రైతుకు న్యాయం చేస్తూ ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయ్యేలా సహకరిస్తూ ఎంపీ తీసుకున్న చొరవ అద్భుతమని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పామాయిల్ రైతులు ఎంపీ పుట్టాతో పాటు మిగిలిన నేతలను గజమాలలతో సత్కరించారు. పామాయిల్ రైతు సంఘాల నాయకులు ఆచంట సూర్యనారాయణ, బొబ్బా వీరరాఘ వరావు, ఉండవల్లి వెంకట్రావు, వంకినేని రామరాజు, క్రాంతికుమార్ రెడ్డి, పెనుమత్స రామరాజు తదితరులు పాల్గొన్నారు.